నీట్ విద్యార్థులకు అన్యాయం జరగనివ్వం..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల18కి వాయిదా వేసింది.

Update: 2024-07-11 13:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల18కి వాయిదా వేసింది. అంతకు ముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం, ఎన్టీఏలు తమ అఫిడవిట్లను దాఖలు చేశాయని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ అఫిడవిట్ల సమాచారాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇంకా స్వీకరించలేదని ధర్మాసనం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే వీటిపై స్పందించేందుకు పిటిషనర్లకు సమయం ఇచ్చింది. జూలై 18న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. కాగా, నీట్ కేసు తొలి విచారణ జూలై 8న జరిగింది. అప్పుడు ఎన్టీఏ, కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.

ఒక్క పరీక్షా కేంద్రానికే పరిమితం: సీబీఐ

నీట్ పేపర్ లీక్‌పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేసింది. అయితే నీట్‌ ప్రశ్నపత్రం బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని విస్తృతంగా వ్యాప్తి చెందలేదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొంత మంది విద్యార్థులకు మాత్రమే ఇది అందిందని చెప్పినట్టు సమాచారం. అలాగే లీకైన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ కాలేదని స్పష్టం చేసింది. మరోవైపు ఎన్టీఏ సైతం ఇదే విషయమై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు: కేంద్ర ప్రభుత్వం

నీట్-యూజీ పరీక్షకు సంబంధించి పాట్నాలో ప్రశ్నా పత్రం మిస్సైన దాఖలాలు కనిపించడం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీంతో పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘ప్రశ్నపత్రం తప్పిపోయినట్లు ఎక్కడా కనిపించలేదు. ప్రతి ప్రశ్నాపత్రం ప్రత్యేక క్రమ సంఖ్యను కలిగి ఉంటుంది. దీనిని నిర్దిష్ట అభ్యర్థికి కేటాయించాం. ఎన్టీఏ పరిశీలకులు కమాండ్‌లోని సీసీటీవీ కవరేజ్‌కు కూడా చూశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా పేపర్ లీకేజీ జరగలేదు’ అని పేర్కొంది. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, సంబంధిత పరిశీలకుల నివేదికలను పరిశీలించినట్లు వెల్లడించింది. నీట్-యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై మూడో వారం నుండి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ కౌన్సిలింగ్‌లో ఎవరైనా నీట్ పరీక్ష అక్రమాల కారణంగా లబ్ది పొందినట్లు గుర్తిస్తే, వారి కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తామని తెలియజేసింది.

కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ విద్యార్థులతో గురువారం సమావేశమయ్యారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని, భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఇలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, కోర్టు నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సుమారు 30 నిమిషాల పాటు విద్యార్థులతో ధర్మేంద్ర ప్రధాన్ చర్చించారు.


Similar News