EVM : ఈవీఎంల పనితీరుపై ఈసీకి కాంగ్రెస్ 20 ఫిర్యాదులు

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేసింది.

Update: 2024-10-09 17:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేసింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలకు సంబంధించిన మొత్తం 20 ఫిర్యాదులను ఈసీకి అందించామని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. అయితే వాటిలో ప్రస్తుతానికి ఏడు ఫిర్యాదులతో ముడిపడిన డాక్యుమెంట్లనే ఈసీ అధికారులకు అందజేశామన్నారు. మిగతా 13 స్థానాలకు సంబంధించిన ఫిర్యాదుల డాక్యుమెంట్లను 48 గంటల్లోగా అందజేస్తామని ఆయన చెప్పారు.

‘‘ఓట్ల లెక్కింపు క్రమంలో కొన్నిచోట్ల ఈవీఎంలలో అకస్మాత్తుగా బ్యాటరీ సమస్య తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థులు సందేహాలను వెలిబుచ్చారు. సడెన్‌గా కొన్ని ఈవీఎంలలో బ్యాటరీ రీడింగ్ 99 శాతం చూపిస్తే..ఇంకొన్నింటిలో 60 నుంచి 70 శాతమే బ్యాటరీ చూపించింది. అలా బ్యాటరీ రీడింగ్ భారీ హెచ్చుతగ్గులతో అసాధారణంగా చూపించిన ఈవీఎంలను సీల్ చేసి, దర్యాప్తు ముగిసే దాకా భద్రపర్చాలి. వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలి’’ అని ఈసీని కోరినట్లు పవన్ ఖేరా వివరించారు. ‘‘ఈసీ అధికారులు నవ్వుతూ మా ఫిర్యాదులు తీసుకున్నారు. తాగడానికి టీ కూడా ఇచ్చారు. అయితే మాకు కావాల్సింది అవి కాదు. మేం లేవనెత్తిన సమస్యకు పరిష్కారాన్ని చూపించాలి’’ అని ఆయన స్పష్టం చేశారు. తప్పకుండా తమ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయిస్తామని ఈసీ అధికారులు హామీ ఇచ్చారని హర్యానా కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ హుడా తెలిపారు. 


Similar News