Lawrence Bishnoi తమ్ముడిని స్వదేశానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారత్

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ అరెస్ట్ అయ్యాడు.

Update: 2024-11-19 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ యూఎస్‌లోని కాలిఫోర్నియా స్టేట్‌లో నిన్న (సోమవారం) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడిని ఇండియాకి తీసుకొచ్చేందుకు మన అధికారులు ప్రయత్నిస్తున్నారు. అన్మోల్ బిష్ణోయ్ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నివాసం వద్ద కాల్పుల వ్యవహారం, పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యలో అన్మోల్ పాత్ర ఉందనేది పోలీసుల మాట. అన్మోల్ బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడని, సెలబ్రిటీలను బెదిరించడం, హత్యలు చేయడం వంటి 18 కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడిని భారత్‌కు రప్పించేందుకు ముంబై పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయనను భారత్‌కు తీసుకురావడానికి ఇప్పటికే ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే అతడికి సంబంధించిన పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ క్రమంలోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తప్పించుకుని తిరుగుతూ దొంగ పాస్‌పోర్ట్‌లతో విదేశాలకు పారిపోయాడు. మొదట్లో కెనడాకు చేరుకున్న అన్మోల్.. ఆ తర్వాత అగ్రరాజ్యమైన అమెరికాలో తలదాచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ అతడిపై రూ.10 లక్షల రివార్డ్‌ను ప్రకటించింది. కాగా.. జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తూ 2021లో బెయిల్‌పై బయటకొచ్చిన అన్మోల్.. ఆ తర్వాత పరారయ్యాడు.


Similar News