Maharashtra Polls: మహారాష్ట్ర ఎన్నికల వేళ చిక్కుల్లో కాషాయ పార్టీ..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Polls) వేళ కాషాయ పార్టీ చిక్కుల్లో పడింది. బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన బహుజన్ వికాస్ అఘాడీ(Bahujan Vikas Aghadi) పార్టీ ఆరోపించింది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Polls) వేళ కాషాయ పార్టీ చిక్కుల్లో పడింది. బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన బహుజన్ వికాస్ అఘాడీ(Bahujan Vikas Aghadi) పార్టీ ఆరోపించింది. నాలసోపరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌కు ఓటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే(Vinod Tawde), మరికొందరు నాయకులు ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. నేతలు డబ్బు పంచుతుండగా తమ పార్టీ నేతలు వారిని అడ్డుకున్నారని, వారు ఏర్పాటు చేసుకున్న వేదిక వద్ద నగదు, పార్టీ డైరీలతో కూడిన కవర్లు లభ్యమయ్యాయని బహుజన్ వికాస్ అఘాడీ వెల్లడించింది. పాల్గర్ జిల్లాలోని విరార్ హోటల్‌లో డబ్బులు పంచినట్లు బీవీఏ అధినేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. రూ.5 కోట్లు పంచినట్లు హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా.. పోలీసులు, ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోవాలని హితేంద్ర డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ విమర్శలు
మరోవైపు, ఆ హోటల్‌లో జరిగిన ఘటన గురించి కాంగ్రెస్ (Congress) పార్టీ ఆ వీడియోలను షేర్ చేసింది. ఓటర్లను వశపరుచుకునేందుకు బీజేపీ డబ్బును పంచిపెడుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు బీవీఏ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వాస్తవాలు బయటకు తీసుకోవాలని కోరింది. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలు అని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించేందుకు మీటింగ్ పెట్టికున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఇకపోతే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీవీఏ ఒంటరిగా పోటీ చేస్తోంది. వసాయ్ స్థానం నుంచి హితేంద్ర ఠాకూర్, నాలాసొపారా నుంచి ఆయన కుమారుడు క్షితిజ్ ఠాకూర్, బోయ్ సర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేష్ పాటిల్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.