ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కోల్‌కతా అండర్ వాటర్ మెట్రో రైలు
ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన కోల్‌కతా అండర్ వాటర్ మెట్రో రైలు సేవలు మార్చి 15 నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన కోల్‌కతా అండర్ వాటర్ మెట్రో రైలు సేవలు మార్చి 15 నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌లోని హావ్‌డా మైదాన్ స్టేషన్ నుండి ఉదయం 7 గంటలకు ఒక రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించగా, అదే సమయంలో ఎస్‌ప్లనెడ్ స్టేషన్ నుండి మరో రైలు బయలుదేరింది. దేశంలోనే ఇది తొలి అండర్‌వాటర్ మెట్రో కావడంతో దీనిలో ప్రయాణించడానికి చాలా మంది ప్రయాణికులు ఉదయాన్నే స్టేషన్‌కు చేరుకుని మొదటి సారిగా నీటి క్రింద భాగంలో రైడ్ కోసం క్యూలో నిల్చున్నారు.
ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు చప్పట్లు కొడుతూ 'వందే భారత్', 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేస్తూ కనిపించడం విశేషం. ఈ అండర్ వాటర్ టన్నెల్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా నిర్మించారు. ఈ మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.120 కోట్లు. దీని ద్వారా హుగ్లీ నదిని 45 సెకన్లలో దాటవచ్చు.