Kolkata rape case: క్రైమ్ సీన్ లోకి ఎవరినీ అనుమతించలేదు.. బీజేపీ ఆరోపణలపై పోలీసుల క్లారిటీ

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో బయటి వ్యక్తులు ఉన్నారని బీజేపీ సోమవారం ఆరోపించింది.

Update: 2024-08-26 14:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని నాలుగో అంతస్తులోని సెమినార్ రూమ్‌లో బయటి వ్యక్తులతో సహా పలువురు ఉన్నారని బీజేపీ సోమవారం ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైద్యులు, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది, బయటి వ్యక్తులతో సంఘటన స్థలంలో ఉండటంతో క్రైమ్ సీన్ పూర్తిగా ధ్వంసమైందని పేర్కొంది. ఇది లైంగిక దాడి, హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఆరోపణలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఆరోపణలను ఖండించారు.

‘సెమినార్ గది లోపల బాధితురాలి మృతదేహం లభించిన ప్రదేశాన్ని కర్టెన్లను ఉపయోగించి చుట్టుముట్టారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించే ప్రశ్నే లేదు. వీడియోలో గుమిగూడుతున్న వ్యక్తులందరూ చుట్టుముట్టబడిన ప్రాంతం వెలుపల ఉన్నారు’ అని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కుటుంబ సభ్యులు తప్ప ఎవరికీ ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదని స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి, ఫోరెన్సిక్ అధికారులు, కొంతమంది పోలీసు అధికారులు మాత్రమే ప్రవేశించగలరని తెలిపారు. మరోవైపు, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ దేబాసిష్ షోమ్, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్‌లను సీబీఐ సోమవారం విచారించింది.  


Similar News