Fast Track Courts : బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు.. పనిచేస్తున్నవి 6 మాత్రమే
దిశ, నేషనల్ బ్యూరో : చిన్నారులు, మహిళలపై లైంగికదాడి ఘటనలపై విచారణ జరపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్రం స్పందించింది.
దిశ, నేషనల్ బ్యూరో : చిన్నారులు, మహిళలపై లైంగికదాడి ఘటనలపై విచారణ జరపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. దీనిపై కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి భగ్గుమన్నారు. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టులను కేటాయిస్తే, వాటిలో 6 మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని ఆమె వెల్లడించారు. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చొరవ చూపకపోవడంతో బెంగాల్‌లో 48,600 లైంగికదాడి, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నపూర్ణ దేవి పేర్కొన్నారు. ఉమెన్ హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, ఛైల్డ్ హెల్ప్‌లైన్‌లను సమర్థంగా అమలు చేయడంలో మమతా బెనర్జీ విఫలమయ్యారని మండిపడ్డారు.
లైంగిక వేధింపుల కేసుల్లో బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో కీలకమైన పోక్సో కోర్టుల ఏర్పాటుపై బెంగాల్ సీఎం శ్రద్ధ పెట్టకపోవడం శోచనీయమన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేసినా, బెంగాల్ సర్కారు పెడచెవిన పెట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం చేష్టల కారణంగా బెంగాల్ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో తక్షణ న్యాయాన్ని పొందలేకపోతున్నారని అన్నపూర్ణ దేవి ఆరోపించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను ఎదుర్కొనేందుకే కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితను 2024 జులై నుంచి అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా అత్యాచారం, సామూహిక అత్యాచారం, మైనర్లపై లైంగిక వేధింపులు వంటి వికృత చేష్టలకు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయన్నారు. ఇప్పటికైనా బెంగాల్ సర్కారు చేస్తున్న పొరపాట్లను గ్రహించి, మహిళలు, చిన్నారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.