Kolkata doctor murder: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ సస్పెండ్

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Update: 2024-08-11 10:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హాస్పిటల్ లోనే హత్య చేశారు. బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసన చేస్తున్నారు. ఈకేసులో నిందితుడిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల పాటు కస్టడీకి తరలించారు. నిరసన తెలుపుతున్న వైద్యులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్‌లో భద్రతా చర్యలను పెంచాలని పదేపదే డిమాండ్ చేసినా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విస్మరించిందని ఆరోపించారు. హాస్పిట‌ల్ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును పెంచాలని కోరారు. రియల్ టైమ్ మానిటరింగ్‌తో పాటు భద్రతను పెంచాలన్న తమ ప్రతిపాదనలను కూడా పరిష్కరించలేదని పేర్కొన్నారు.

ఐఎంఏ అల్టిమేటం

శనివారం సాయంత్రం అధికారులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. త్వరితగతిన విచారణ జరిపించాలని.. ఆలోగా నిందితులను అరెస్టు చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని హెచ్చరించింది. నేరంపై నిష్పక్షపాతంగా, వేగంగా విచారణను కోరాలని పేర్కొంది. పని ప్రదేశాల్లో వైద్యుల భద్రతను మెరుగుపరిచేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నేరానికి దారితీసిన పరిస్థితులపై కూడా డిమాండ్ చేసింది.


Similar News