త్యాగాలకు సిద్ధం.. పొత్తులపై ఖర్గే మరోసారి సెన్సేషనల్ కామెంట్స్!

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-25 08:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో త్యాగాలకు సైతం రెడీ అని అనౌన్స్ చేశారు. ఛత్తీస్ గఢ్ రాయపూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో శనివారం మాట్లాడిన ఖర్గే.. దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారి డీఎన్ఏ పేదలపై దాడులు చేయడమే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజల ఓట్లతో ప్రభుత్వాలను మార్చడమే మా ప్రయత్నం తప్ప డబ్బు సంచుల ద్వారా లేదా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల సాయంతో కాదన్నారు.

దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెసేనని చెప్పారు. దేశంలోని అన్ని సవాళ్లను ఎదుర్కొంటామని భారత్ జోడో యాత్ర దేశానికి ఓ సూర్యకాంతి లాంటిదని పేర్కొన్నారు. వేలాది మంది దేశ ప్రజలు రాహుల్ గాంధీతో చేతులు కలిపారని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమ హృదయాలలో ఉందని నిరూపించారని చెప్పారు. రాహుల్ గాంధీ యువతకు ఓ స్పూర్తిగా నిలిచారని అభిప్రాయపడ్డారు. ఈ ప్లీనరీ సమావేశాలను ఆపడానికి బీజేపీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిందని కానీ వాటిని మేము సమర్ధవంతంగా ఎదుర్కొని ఇక్కడ నిలబడ్డామన్నారు

Tags:    

Similar News