Kharge: అబద్ధాలు చెప్పడంలో మోడీ అనుభవజ్ఞుడు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుభవజ్ఞుడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

Update: 2024-10-02 12:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుభవజ్ఞుడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో బీజేపీ దారుణంగా విఫలమైందని ఆరోపించారు. హర్యానాలోని బధ్రాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చాడని కానీ అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ప్రధానులు నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు ఒక్కరోజు కూడా అసత్యాలు ప్రచారం చేయలేదన కొనియాడారు. ప్రతి ఏటా రూ.2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారని.. మరి పదేళ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

హర్యానాలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ చెబుతోందని.. కానీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1.60 లక్షల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. కానీ ఆ ఇంజన్ ఫెయిల్ కావడంతో ఆయనను మార్చారని తెలిపారు. వారి పని సక్రమంగా ఉంటే సీఎంను మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీఎం భూపీందర్ సింగ్ హుడా హయాంలో చేసిన పనులు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. బీజేపీకి దేశంలోని రైతులు, సైనికులపై అసలే పట్టింపులేదని తెలిపారు.


Similar News