Kharge: కాంగ్రెస్ పథకానికి పేరుమార్చి కోట్లలో దోపిడి.. ఏఐసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బ్యాంకుల ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని, సాధారణ ఖాతాలు, జన్ ధన్ ఖాతాలు కలపడం ద్వారా కోట్లు కొల్లగొట్టారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంకుల ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని, సాధారణ ఖాతాలు, జన్ ధన్ ఖాతాలు కలపడం ద్వారా కోట్లు కొల్లగొట్టారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జన్ ధన్ పథకం 10వ వార్షికోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన మోడీ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. ప్రజల సొమ్మును దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం బ్యాంకులను సాధనంగా మార్చుకున్నదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు అంటూ.. 10 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు మూసివేయబడ్డాయి, వీటిలో దాదాపు 50% బ్యాంకు ఖాతాలు మహిళలకు చెందినవి కాదా? అని నిలదీశారు. డిసెంబర్ 2023 వరకు రూ.12,779 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, మొత్తం జన్ ధన్ ఖాతాలలో 20% మూతపడటానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
అలాగే గత తొమ్మిదేళ్లలో జన్ ధన్ ఖాతాలలో సగటు బ్యాలెన్స్ రూ.5000 కంటే తక్కువ, అంటే రూ. 4,352 మాత్రమేనని, బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్న ద్రవ్యోల్బణం మధ్య ఈ కొద్దిపాటి డబ్బుతో పేదవాడు ఎలా బతకగలడని ప్రశ్నించారు. అంతేగాక సాధారణ ఖాతాలు, జన్ ధన్ ఖాతాలను కలపడం ద్వారా, మోడీ ప్రభుత్వం 2018 నుండి 2024 వరకు కనీసం రూ.43,500 కోట్లు కొల్లగొట్టిందని, పార్లమెంటులో ఇచ్చిన సమాధానాల ప్రకారం.. కేవలం అదనపు ఏటీఎం లావాదేవీలు, మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు, ఎస్ఎంఎస్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసిందనేది నిజం కాదా అని పలు ప్రశ్నలు సంధించారు. ఇక మార్చి 2014 వరకు 24.3 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిచిన కాంగ్రెస్-యుపిఎల నో ఫ్రిల్స్ ఖాతాల పథకం పేరుమార్చి నేటికి 10వ వార్షికోత్సవం అవుతుందని తెలిపారు.
నేడు మోడీ ప్రభుత్వం ఊదరగొడుతున్న వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని.. 2005లో, కాంగ్రెస్-యుపిఎ ప్రభుత్వం "నో ఫ్రిల్స్ ఖాతాలు" తెరవాలని బ్యాంకులను ఆదేశించిందని, 2010లో, ఆర్‌బీఐ 2010 నుండి 2013 వరకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్లాన్‌ను సిద్ధం చేసి అమలు చేయాలని బ్యాంకులను కోరిందని, 2011లో, కాంగ్రెస్-యుపిఎ ప్రభుత్వం మేజర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఇనిషియేటివ్ 'స్వాభిమాన్'ని ప్రారంభించిందని అన్నారు. 2012లో, "నో ఫ్రిల్స్ ఖాతాలు" అనే ప్రభుత్వ పేరు వచ్చిందని, 2013లో, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్లాన్‌ను 2016 వరకు పొడిగించాలని బ్యాంకులను ఆదేశించిందని, దీనినే మోడీ ప్రభుత్వం జన్ ధన్ యోజనగా మార్చిందని విమర్శలు చేశారు. ఇక 2013లోనే, కాంగ్రెస్-యుపిఎ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పథకాన్ని ప్రారంభించిందని, దానితో 291 జిల్లాల్లో ఎల్‌పిజి సబ్సిడీని అందించడానికి ఆధార్‌తో అనుసంధానం చేసిందని, ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ “పహల్” పథకాన్ని వ్యతిరేకించాయని గుర్తుచేశారు. నేడు అవే పథకాలను ఉపయోగించుకుంటూ మోడీ జీ ప్రకటనల్లో బిజీగా ఉన్నారని ఖర్గే ఎక్స్ లో రాసుకొచ్చారు.