కేజ్రీవాల్ మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు..సునీతను అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు

జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైద్య రికార్డులను పొందేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది.

Update: 2024-07-06 13:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైద్య రికార్డులను పొందేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ తరపున మెడికల్ బోర్డు లేదా వైద్యులను స్వతంత్రంగా సంప్రదించి సలహాలు తీసుకోవచ్చని తెలిపింది. వైద్యపరమైన రికార్డులు అందజేయడంపై జైలు అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు పేర్కొంది. అయితే వైద్యులతో సంప్రదింపుల సందర్భంగా సునీతా కేజ్రీవాల్‌ను తన అటెండర్‌గా అనుమతించేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేజ్రీవాల్ చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. ఎయిమ్స్ మెడికల్ బోర్డు సూచించిన డైట్‌కు అనుగుణంగా కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు ఆయనకు ఇంట్లో వండిన ఆహారాన్ని అందిస్తున్నారని వెల్లడించింది. కేజ్రీవాల్ మెడికల్ రిపోర్ట్స్ సునీతకు అందజేయాలని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా అధికారులను ఆదేశించారు.

కేజ్రీవాల్ రాజకీయ కుట్రకు బలయ్యారు: సునీతా కేజ్రీవాల్

తన భర్త కేజ్రీవాల్ రాజకీయ కుట్రకు బలయ్యారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సాక్షుల తప్పుడు వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఎంపీ శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. తన కుమారుడు రాఘవ మాగుంట రెడ్డిని అరెస్టు చేసి, బెయిల్ నిరాకరించిన తర్వాత ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని శ్రీనివాసులు మార్చుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌కు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఆయనకు మద్దతు ఇవ్వకపోతే, విద్యావంతులెవరూ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడబోరని చెప్పారు. మరోవైపు రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన కేసులో కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 16 వరకు పొడిగించింది. 


Similar News