Karnataka: మావోయిస్ట్ విక్రమ్ గౌడ ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన కర్ణాటక సీఎం
అతను అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడని, లొంగిపోవడానికి నిరాకరించారని అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విక్రమ్ గౌడ ఎన్‌కౌంటర్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించారు. అతను అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడని, లొంగిపోవడానికి నిరాకరించాడని అన్నారు. కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులలో ఒకరైన విక్రమ్ గౌడపై కర్ణాటకలో 61 కేసులు, కేరళలో 19 కేసులున్నాయి. 'స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం వారు లొంగిపోతే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పాం. అయినప్పటికీ అతను లొంగిపోలేదు. కేరళ ప్రభుత్వం అతనిపై రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. మా ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల రివార్డు ప్రకటించిందని' అన్నారు. ఇదే సమయంలో ఎన్‌కౌంటర్‌పై మేధావులు సందేహం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించిన సిద్ధరామయ్య, ఎన్‌కౌంటర్‌ను అభినందించాలి, నక్సలిజం ఉండాలా లేదా అంటూ ప్రశ్నించారు. ఉడిపి జిల్లా, కబ్బినలే ప్రాంతంలోని పీటెబైలు గ్రామ సమీపంలో ఏఎన్‌ఎఫ్ పోలీసులు విస్తృతంగా జరిపిన కూంబింగ్ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 ఏళ్లకు పైగా పరారీలో ఉన్న విక్రమ్ గౌడ మరణించారు.