ఎన్నికల హామీల అమలుకు కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన 5 హామీల అమలుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

Update: 2023-07-07 11:55 GMT

బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన 5 హామీల అమలుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసింది. 5 హామీల అమలుకు రూ.52,000 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి హోదాలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ పథకాల వల్ల 1.3 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. మొత్తం రూ.3.27 లక్షల కోట్లతో 2023-2024 బడ్జెట్‌ను సిద్ధరామయ్య శుక్రవారం ప్రవేశపెట్టారు.

ఐదు హామీల అమలుకు కేటాయించిన బడ్జెట్ ద్వారా ప్రతి కుటుంబానికి అదనంగా రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ సాయం అందుతుందని ఆయన చెప్పారు. సర్కారు అమలు చేస్తున్న 5 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం, ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ.2,000 సాయం, యువకులకు రూ.3,000 వరకూ నిరుద్యోగ భృతి వంటివి ఉన్నాయి.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే దిశగానూ సిద్ధరామయ్య పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియన్ మేడ్ లిక్కర్ పై ఎక్సైజ్ డ్యూటీని 20% పెంచారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీర్ సహా లిక్కర్ ధరలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 18 స్లాబ్ ల్లో అదనంగా 20% ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. ఈ పెంపు తరువాత కూడా కర్నాటకలో లిక్కర్ ధరలు పొరుగు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉంటాయని సిద్ధ రామయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తి విలువలను సవరించారు.

"నమ్మ మెట్రో" పథకానికి రూ. 30 వేల కోట్లను కేటాయించారు. మోరల్ పోలీసింగ్ పేరుతో ప్రజలను వేధించే వారిపై, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలుంటాయని సిద్ధ రామయ్య హెచ్చరించారు. ఇక 2023-24 బడ్జెట్ ను సమర్పించడంతో ఆర్థిక మంత్రిగా 14 సార్లు బడ్జెట్ ను ప్రతిపాదించిన రికార్డును సిద్ధరామయ్య సాధించారు. గతంలో 13 సార్లు బడ్జెట్‌ను ప్రతిపాదించిన రికార్డు మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే పేరిట ఉంది.


Similar News