Karge: రాజ్యాంగాన్ని ముక్కలు చేసేందుకే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రయత్నం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
సంభాల్ హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ (Uthara Pradesh)లోని సంభాల్ హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) ఫైర్ అయ్యారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS)లు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు విభజన ఎజెండాతో రాజ్యాంగాన్ని ముక్కలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. సంభాల్‌లో బాధితులను పరామర్శించకుండా రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది’ అని పేర్కొన్నారు.
‘రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఏకైక సిద్ధాంతం. దీని కోసం వారు రాజ్యాంగం ఆమోదించిన ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని తెలిపారు. సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమను వ్యాప్తి చేయడం కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రంతో సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. తలవంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా, సంభాల్‌కు వెళ్తుండగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందాన్ని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతలు తిరిగి వచ్చారు.