Jpc meeting: ‘జమిలీ’రాజ్యాంగ విరుద్ధం.. జేపీసీ తొలి సమావేశంలో ప్రతిపక్ష ఎంపీల ఫైర్ !

పార్లమెంటులో ప్రవేశపెట్టిన129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జేపీసీ తొలి సమావేశం నిర్వహించారు.

Update: 2025-01-08 15:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election) కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం బుధవారం నిర్వహించారు. జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రతిపాదిత చట్టంపై బీజేపీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మీటింగ్‌కు హాజరైన సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు చట్టాల్లో పొందుపర్చిన నిబంధనలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రామ్ నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను కూడా అవగాహన కల్పించారు. ప్రజెంటేషన్ అనంతరం పలువురు ఎంపీలు జేపీసీ ప్యానెల్ ముందు పలు ప్రశ్నలు సంధించారు. జమిలీ ప్రతిపాదన రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమే గాక అనేక రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేసి, తమ పదవీకాలాన్ని లోక్‌సభతో అనుసంధానం చేసిందన్న ఆరోపణలు చేయగా బీజేపీ ఎంపీలు దానిని తోసిపుచ్చినట్టు సమాచారం.

ఫెడరలిజంపై దాడి: కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ

కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యులు ప్రతిపాదిత చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధమని, దాని ప్రాథమిక నిర్మాణంతో పాటు ఫెడరలిజంపై దాడి చేశారని ఆరోపించారు. డబ్బు ఆదా చేయడం కంటే ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం చాలా ముఖ్యమని టీఎంసీ ఎంపీ తెలిపారు. అంతేగాక రెండు బిల్లులను పరిశీలించడానికి కనీసం ఒక సంవత్సరం పదవీకాలం ఇవ్వాలని కొందరు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే కోవింద్ కమిటీ అభిప్రాయాలు తీసుకునే టైంలో కాన్సెప్ట్‌ను సమర్ధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి, బిల్లులపై అనేక ప్రశ్నలను లేవనెత్తారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పత్రాలను తప్పనిసరిగా మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం 18వేలకు పైగా పేజీల పత్రాలను సూట్‌కేస్‌లో కమిటీ సభ్యులకు అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సూట్‌కేస్‌తో ఉన్న చిత్రాన్ని ఎక్స్‌లో షేర్ చేశారు.

ఏకాభిప్రాయం వస్తుందనే నమ్మకం ఉంది: పీపీ చౌదరి

బీజేపీ ఎంపీ, జేపీసీ అధ్యక్షుడు పీపీ చౌదరి మాట్లాడుతూ.. జమిలీ బిల్లును నిష్పక్షపాతంగా పరిశీలిస్తామని తెలిపారు. ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తామని, జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేస్తామని నొక్కి చెప్పారు. ఏకాభిప్రాయం వస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని తెలిపారు. కాగా, గతేడాది డిసెంబరు 17న న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిని పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు 39 మంది సభ్యులతో కూడిన జేపీసీని ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News