Kangana Ranaut : మరో వివాదంలో కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్, మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తనని కలిసేందుకు వచ్చే ప్రజలు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని అన్నారు.

Update: 2024-07-12 06:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్, మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తనని కలిసేందుకు వచ్చే ప్రజలు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమవెంట ఆధార్‌ కార్డు ఉంచుకోవాలి. అలాగే నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఒక పేపర్‌పై రాసివ్వాలి. దానివల్ల ఎలాంటి అసౌకర్యానికి తావుండదు’’ అని ఆమె సూచించారు. హిమాచల్ లోని ఉత్తరప్రాంత ప్రజలు తనతో భేటీ అయ్యేందుకు మనాలి లోని తన ఇంటికి కూడా రావొచ్చని అన్నారు. మండీ ప్రజలు నగరంలోని తన కార్యాలయానికి రావొచ్చన్నారు. టూరిస్టులు ఎక్కువగా వస్తుండటంతో సామాన్యులు చాలా అసౌకర్యాలకు గురవుతున్నారని ఆమె తెలిపారు. అందుకే తనను కలిసేందుకు ఆధార్ తప్పనిసరి అని సూచించారు.

కంగనాపై కాంగ్రెస్ విమర్శలు

కంగనా ఆధార్ కార్డు డిమాండ్ పై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రజలు తనను కలవాలనుకుంటే ఆధార్ కార్డ్ తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘మేం ప్రజాప్రతినిధులం. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. అది చిన్న పని అయినా, పెద్ద పని అయినా, విధానపరమైన అంశం అయినా, వ్యక్తిగత పని అయినా దానికి ఆధార్ అవసరం లేదు. ఒకరు ప్రజా ప్రతినిధి వద్దకు వస్తున్నారంటేనే ఏదో పనికోసం అని అర్థం ”అని కంగనాకు విక్రమాదిత్య కౌంటర్ ఇచ్చారు. తనని కలిసేందుకు ఆధార్ తీసుకురావాలని అడగడం సరికాదని హితవు పలికారు.

Tags:    

Similar News