పెళ్లిళ్లలో పురుషుల పెత్తనంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో : పెళ్లి విషయంలో పురుషులు తమ పెత్తందారీ పోకడలను విడనాడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : పెళ్లి విషయంలో పురుషులు తమ పెత్తందారీ పోకడలను విడనాడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలని.. అదే సమయంలో వివాహాల విషయంలో స్త్రీలను చిన్నచూపు చూసే వైఖరిని విడనాలని పిలుపునిచ్చారు. ‘భారతీయ మహిళల సాధికారతలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జస్టిస్ సునంద భండారే 28వ స్మారకోపన్యాసంలో భాగంగా జస్టిస్ బి.వి.నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు. వివాహం అనే సముదాయానికి మహిళలు, పురుషులు ముఖ్యమైన మూల స్తంభాలని చెప్పారు. కుటుంబం సంతోషం, మహిళల సంతోషం అనే రెండు పునాదుల మీద మాత్రమే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలు నిలబడగలుగుతాయని ఆమె స్పష్టం చేశారు. కుటుంబాలలో మహిళలను అణచివేసే చర్యల వల్లే వివాహ బంధాలు తెగిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు.
మహిళల లీగల్ కెరీర్‌పై ఇలా అన్నారు..
ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక కుటుంబంతో పాటు స్త్రీల పాత్ర కూడా ఉంటుందని మర్చిపోకూడదన్నారు. కనీసం ఇటువంటి సందర్భాల్లోనైనా స్త్రీల పాత్రను తగ్గించి చూపకూడదని జస్టిస్ బి.వి.నాగరత్న సూచించారు. ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే మహిళల ఎదుట ఇంట్లో వాళ్లు సంధించే మాటల అస్త్రాలు అడ్డుగోడల్లాగా నిలబడుతున్నాయి. ఇంటి పనులను సమానంగా విభజించుకునే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఇవే వారికి కెరీర్‌లో పెద్ద ఆటంకాలుగా పరిణమిస్తున్నాయి’’ అని ఆమె చెప్పారు. కాగా, 2027లో భారత సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.వి.నాగరత్న నియమితులు కానున్నారు.