Jammu & Kashmir: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. బీజేపీ 'ఏకాత్మ మహత్సవ్' ర్యాలీ

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి సోమవారానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ 'ఏకాత్మ మహత్సవ్' ర్యాలీని నిర్వహించనుంది.

Update: 2024-08-05 05:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి సోమవారానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ 'ఏకాత్మ మహత్సవ్' ర్యాలీని నిర్వహించనుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా భద్రతాదళాలు అణువణువునా పహారా కాస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దును పురస్కరించుకుని ర్యాలీని నిర్వహిస్తున్న బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సహా ప్రతిపక్షాలు ఆగస్టు 5ని "బ్లాక్ డే"గా పేర్కొన్నాయి. గాంధీనగర్ లోని పీడీపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన నిర్వహించనున్నట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును ఖండిస్తూ మహారాజా హరిసింగ్ పార్క్‌లో నిరసన ప్రదర్శన కూడా నిర్వహిస్తామని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) ప్రతినిధి తెలిపారు.

అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను ఒకరోజు పాటు నిలిపివేసింది. ముందుజాగ్రత్త చర్యగా భగవతి నగర్ బేస్ క్యాంప్ నుండి యాత్రికులెవరని బయటకు రానివ్వలేదు. ముందుజాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్ కు కొత్తబ్యాచ్ అనుమతించట్లేదన్నారు. అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది.


Similar News