Jinping: చైనాలో తైవాన్ విలీనాన్ని ఎవరూ ఆపలేరు.. జిన్‌పింగ్
తైవాన్‌ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని డ్రాగన్ అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ (Taiwan)ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Jinping) అన్నారు. మంగళవారం ఆయన నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలది ఒకే కుటుంబం. వారి బంధాలను ఎవరూ విడదీయలేరు. జాతీయ పునరేకీకరణను ఎవరూ ఆపలేరు’ అని తెలిపారు. తైవాన్ ఎప్పటికైనా చైనాలో విలీనం కాక తప్పదని స్పష్టం చేశారు. ప్రపంచంలో అనూహ్య మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయన్నారు. చైనా అన్ని దేశాలతో స్నేహాన్ని, సహకారాన్ని పెంపొందిస్తుందని, ప్రపంచానికి మంచి భవిష్యత్తును సృష్టించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 2024లో స్వదేశంలో, విదేశాలలో మారుతున్న పర్యావరణ ప్రభావాలపై చురుకుగా స్పందించామని, అభివృద్ధిని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. కాగా, తైవాన్‌ను చైనా తన సొంత భూభాగంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ వాదనను తైవాన్ తిరస్కరిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే జిన్ పింగ్ తాజా ప్రకటనతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.