జయహో.. ఇండియన్ రైల్వేస్
దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తూ నిత్యం అందుబాటులో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ మన భారతీయ రైల్వే వ్యవస్థ.
దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తూ నిత్యం అందుబాటులో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ మన భారతీయ రైల్వే వ్యవస్థ. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా ఎప్పటికప్పుడు రూపాంతంరం చెందుతూ సరికొత్త సేవలను ప్రయాణికులకు అందస్తూ ఒకే యాజమన్యం గల ప్రభుత్వ సంస్థగా ఇండియన్ రైల్వేస్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. అప్పట్లో దేశాన్ని పాలించిన బ్రిటీష్ వారు దేశంలో ఉన్న సహజ సంపదను తరలించేందుకు 1853, ఏప్రిల్ 16న తొలిసారిగా రైల్వే లైన్ ను ప్రారంభించారు.
స్వాతంత్ర్యం అనంతరం ప్రజా రవాణా వ్యవస్థగా రూపాంతరం చెందింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించే స్థాయికి చేరింది. రైల్వే వ్యవస్థ దేశంలో ప్రారంభమై 170 ఏళ్లు పూర్తయ్యాయంటే మన భారతీయ రైల్వే ఎంత పురాతనమైందో మనకు అర్థమవుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ మన ఇండియాలోనే ఉంది. రోజుకు 23 మిలియన్ల ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది.
ఉదాహరణకు చెప్పాలంటే.. దేశంలో ఒక్క రోజు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం. ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రకారం చూస్తే.. ఇండియన్ రైల్వే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. దాదాపుగా సంస్థలో మొత్తం 1.4 మిలియన్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన లోకోమోటివ్ స్టీమ్ ఇంజన్ ఫెయిరీ క్వీన్ ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ - రాజస్థాన్ మధ్య నడుస్తుంది. అప్పట్లో బ్రిటీష్ సామ్యాజ్యంలోని ఈస్ట్ ఇండియా రైల్వే కోసం కీన్ స్టన్ థామ్సన్, హెవిట్ సన్ కలిసి లోకోమోటివ్ స్టీమ్ ఇంజన్ రైలును రూపొందించారు.
రెగ్యూలర్ ఆపరేషన్స్ లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన లోకోమోటివ్ స్టీమ్ ఇంజన్ రైలుగా ఫెయిరీ క్వీన్ ఎక్స్ ప్రెస్ 1998లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. అదేవిధంగా ఆ రైలు బెర్లిన్ లోని ఇంటర్నేషనల్ టూరిస్ట్ బ్యూరో నుంచి హెరిటేజ్ అవార్డును అందుకుంది. ప్రపంచంలో అతిపెద్ద రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఉన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.
త్రివేడ్రం - హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ నాన్ స్టాప్ ట్రైన్ వడొదర - కలకత్తా వరకు 528 కి.మీ. ఆగకుండా ప్రయాణిస్తుంది, అది కూడా ఆరున్నర గంటల్లో తన గమ్యస్థానానికి చేరుతుంది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా జమ్ము, కాశ్మీర్ లోని రీసీ జిల్లాలో చేనాబ్ రైల్వే వంతెన త్వరలో పూర్తి కానుంది. దీని ఎత్తు దాదాపు 359 మీటర్లు.. అంటే పారిస్ లోని ఈఫిల్ టవర్ కన్నా ఎక్కువే. ఇండియన్ రైల్వే హిస్టరీలో అత్యంత వేగవంతమైన రైలు శాతాబ్ధి ఎక్స్ ప్రెస్. ఇది న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు నడుస్తుంది. ఈ రైలు ఫరీదాబాద్ నుంచి ఆగ్ర మధ్యలో 150 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోవడం విశేషం.
అదేవిధంగా అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెటపాలియం - ఊటీ ప్యాసింజర్ రైలు. ఇది ఊటీ పరిసర ప్రాంతాల్లో నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 10 కి.మీ మాత్రమే. మొదటి సారిగా1891లో ఫస్ట్ క్లాస్ రైళ్లలో, 1907 నుంచి స్లీపర్ క్లాస్ రైళ్లలో టాయిలెట్లను ప్రవేశపెట్టారు. మొదటి సారిగా 1974లో ఫస్ట్ క్లాస్ లో ఏసీ సౌకర్యం కల్పించారు. అప్పట్లో భారత రైల్వేనే గ్రేట్ ఇండియన్ పెనిన్ చిల్లర్ రైల్వే అనేవారు. 2012, జూలై 30, 31న పవర్ గ్రిడ్స్ లో అంతరాయం వల్ల దాదాపు 6 మిలియన్ల ప్రజలు కొన్ని గంటల పాటు విద్యుత్ లేకుండా గడిపారు. ఆ సమయంలో వందలాది రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
1925 ఫిబ్రవరి 3న ఎలక్ట్రికల్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 1981, జూన్ 9న ఈస్టర్న్ రైల్వే పరిధిలో ఉన్న బిహార్ ప్రాంతంలోని భాగమతి నదిలో ప్యాసింజర్ రైలు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఇది భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రైలు వివత్తుగా నిలిచింది. ఈ ప్రమాదంలో దాదాపు 500 మంది ప్రయాణికులు ప్రాణాలు కొల్పోయారు. అదేవిధంగా గౌహతి - తిరువనంతపురం ఎక్స్ ప్రెస్ ఇండియన్ రైల్వే నెట్ వర్క్ లో లాంగ్ ట్రాక్ కలిగిన రికార్డును సొంతం చేసుకుంది. ఇది దాదాపు 10 నుంచి 12 గంటల ఆలస్యంగా తన గమ్య స్థానానికి చేరుతుంది.
ఒడిశాలోని ఇబ్ అనేది అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్. అదేవిధంగా అతిపెద్ద పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లోని వెంకటనరసింహరాజు వారి పేట పేరు మీద ఉంది. ఇండియన్ రైల్వేకు చెందిన ఐ.ఆర్.సీ.టీ.సీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) వెబ్ సైట్ ను నిమిషానికి 12 లక్షల మంది వీక్షిస్తారు. యూనెస్కోలో భారతదేశంలోని నాలుగు రైల్వే ప్రాంతాలు వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడ్డాయి.
అవి 1999లో డార్జిలింగ్ - హిమాలయన్ రైల్వేస్, 2004లో ముంబాయిలోని సీఎస్టీ బిల్డింగ్, 2005 నీలగిరి మౌంటెయిన్ రైల్వేస్, 2008లో పాలక్కాడ్ - సిమ్లా రైల్వేస్. భారతదేశంలోని 1881లో బ్రటీష్ వలస రాజుతో నిర్మించబడిన డార్జిలింగ్ ఫాల్ ట్రైన్ ఇప్పటికీ తమ స్వదేశీ స్టీమ్ ఇంజన్ తో నడుస్తుండటం విశేషం. అదేవిధంగా నవపూర్ అనే రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల్లో నిర్మించబడినది. అది సగ భాగం మహారాష్ట్రలో, మిగతా సగ భాగం గుజరాత్ లో ఉంది.
సంఝౌతా ఎక్స్ ప్రెస్.. దీనిని ఫ్రెండ్ షిప్ ఎక్స్ ప్రెస్ గా పిలుస్తారు. 1976, జూలై 22న ప్రారంభమైన ఈ రైలు భారత్, పాకిస్థాన్ మధ్య నడిచేది. కానీ, డిసెంబర్ 13, 2001న భారత పార్లమెంట్ పై పాకిస్థాన్ కు చెందిన ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఆ క్రమంలో జనవరి 1, 2002న రైలు రాకపోకలను నిలిపివేస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మళ్లీ.. జనవరి 15, 2002లో రాకపోకలను పున:ప్రారంభించారు. డిసెంబర్ 27, 2007 పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో హత్యోదంతం తరువాత సంఝౌత ఎక్స్ ప్రెస్ ను మళ్లీ నిలిపివేశారు.
2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా సేవలందించిన లాలు ప్రసాద్ యాదవ్ వరుసగా ఆరు సార్లు రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు వివేక్ ఎక్స్ ప్రెస్.. ఇది దిబ్రూగర్, నాగ్ పూర్ మధ్య గల 4,270 కి.మీ ప్రయాణిస్తుంది. దేశంలో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు నాగ్ పూర్ - అజ్ని మధ్య నడుస్తుంది. కేవలం ఇది 3 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం నాగ్ పూర్ నుంచి చాలా మంది కార్మికులు అజ్ని పారిశ్రామిక వాడకు ఈ రైలులోనే వెళ్తారు.
భారతీయ రైల్వే చరిత్రలో ఎక్కువ స్టాప్ లు ఉన్న ఎక్స్ ప్రెస్.. హౌరా - అమృత్ సర్ ఎక్స్ ప్రెస్. దాదాపు ఈ ట్రైన్ 115 స్టాప్ లలో ఆగుతుంది. దేశంలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్న గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ట్రాక్ ఓ వైపు శ్రీరామ్ పూర్ రైల్వే స్టేషన్, మరోవైపు బేలా పూర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇండియన్ రైల్వేలో అత్యంత శక్తివంతమైన రైళ్లలో WAG-12 అనే ఎలక్ట్రికల్ రైలు ఒకటి. ఇది దాదాపు 1,200 హర్స్ పవర్ ను కలిగి ఉంది. దేశం నలువైపులా ఉన్న స్టేషన్లలో ఉత్తరాన బారాముల్ల రైల్వే స్టేషన్ జమ్మూ, కాశ్మీర్ ఉంది.
దక్షిణాన కన్యాకుమారి రైల్వే స్టేషన్ తమిళనాడులో ఉంది. పశ్చిమాన నలియా రైల్వే స్టేషన్, గుజరాత్ లో ఉంది. తూర్పున లిడో రైల్వేస్టేషన్ అస్సాంలో ఉంది. ఏడు ట్రాక్ లు సమాంతరంగా.. 10 కి.మీ. పాటు ఉన్న రూట్ మహారాష్ట్రలోని బాండ్రా నుంచి అంధేరీ వరకు విస్తరించి ఉంది. దేశంలోని అత్యంత రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ లక్నో. ఈ స్టేషన్లో రోజుకు 64 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫాం కర్ణాటక లోని హుబ్లీలో ఉంది. దీని పొడవు దాదాపు 1,507 మీటర్లు గా ఉంది.
ప్రస్తుతం 14,300 రైళ్లు దేశ వ్యాప్తంగా పరుగులు పెడుతున్నాయి. ఈ మొత్తం రైళ్లు ప్రయాణించే దూరం భూమి నుంచి చంద్రునికి మూడున్నర రెట్లతో సమానం అంటే.. మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ రైల్వే గొప్పతనం. రైల్వే సొరంగాల్లో అత్యంత పొడవైనది జమ్మూ, కాశ్మీర్ లోని తిరుపంజల్ సొరంగ మార్గం, దీని పొడవు 11.24 కి.మీ. మొట్టమొదటి భూగర్భ రైల్వేను కలకత్తా మొట్రోలో ప్రారంభించారు.
దేశంలో మొట్టమొదటి సారిగా కంప్యూటరైజ్డ్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను 1986లో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ఏప్రిల్ 16, 1853న, భారతీయ రైల్వే ప్రప్రథమంగా బోరి బందర్ నుంచి థానే వరకు 34 కి.మీ దూరం వరకు మొదటి ప్యాసింజర్ రైలును ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ రోజును ఆ సంస్థ భారతీయ రైలు రవాణా దినోత్సవంగా గుర్తించారు. ఇవి.. భారతీయ రైల్వే సమగ్ర విశేషాల సమాహారం.