మరో 15 ఏళ్లు భారత్‌లో మేమే : జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో : మరో పదేళ్ల నుంచి 20 ఏళ్ల పాటు భారతదేశంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని, సుస్థిర ప్రభుత్వమే కొనసాగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : మరో పదేళ్ల నుంచి 20 ఏళ్ల పాటు భారతదేశంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని, సుస్థిర ప్రభుత్వమే కొనసాగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ఉంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకునే చొరవను ప్రభుత్వాలు ప్రదర్శించగలుగుతాయని పేర్కొన్నారు. భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన నిక్కీ ఫోరమ్ సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నూటికి నూరు శాతం విశ్వాసంతో నేను చెప్పేది ఏమిటంటే.. వచ్చే 15 ఏళ్ల పాటు భారత్‌లో సుస్థిర ప్రభుత్వమే ఉంటుంది. అది 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ చెప్పారు. పూర్తి మెజారిటీని కలిగిన ప్రభుత్వాలు ధైర్యవంతంగా, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయన్నారు. ‘‘అధికారంలో ఉన్నవాళ్లకు కేవలం విజన్ ఉంటే సరిపోదు. తగిన మెజారిటీ కూడా ఉండాలి. అలాంటప్పుడే విజన్‌ను నిజం చేసే దిశగా పనిచేయగలుగుతారు. నిర్ణయాలను తీసుకోగలుగుతారు’’ అని ఆయన తెలిపారు. ‘‘కచ్చితంగా గత 10 సంవత్సరాలుగా మేం భారత్‌లో విజన్‌ను నిజం చేసే దిశగా పనిచేశాం. పూర్తి మెజారిటీ వల్లే అది సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు. జపాన్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో మార్చి 6 నుంచి 8 వరకు జైశంకర్ జపాన్‌లో పర్యటించారు.