Jpc meeting: జనవరి 8న జేపీసీ తొలి సమావేశం.. జమిలీ ప్రతిపాదనపై డిస్కషన్ !

వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కోసం ఏర్పాటైన జేపీసీ తొలి సమావేశం వచ్చే ఏడాది జనవరి 8న జరగనున్నట్టు తెలుస్తోంది.

Update: 2024-12-23 14:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (One nation one election) కోసం ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం వచ్చే ఏడాది జనవరి 8న జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఎంపీ పీపీ చౌదరి (PP Chowdary) ఈ భేటీకి పిలుపునిచ్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జమిలీ ప్రతిపాదనపై చర్చించడంతో పాటు పలువురి అభిప్రాయాలు తీసుకోనున్నట్టు సమాచారం. అయితే జేపీసీ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై పలువురి నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లును జేపీసీకి పంపించారు. కమిటీలో లోక్‌సభ, రాజ్యసభ నుంచి 39 మంది సభ్యులు ఉన్నారు. వచ్చే పార్లమెంట్ సెషన్ చివరి వారంలో జేపీసీ తన నివేదికను లోక్ సభలో అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన పనిని వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News