జగదీష్ షెట్టర్ జంప్.. మళ్లీ బీజేపీ గూటికి.. ఏడాదిలోనే పీఛేముడ్
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ .. మళ్లీ బీజేపీ గూటికి చేరారు.
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ .. మళ్లీ బీజేపీ గూటికి చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సమక్షంలో ఈ చేరిక జరిగింది. జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి జగదీష్ షెట్టర్‌ను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా షెట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని సమస్యల వల్ల నేను గతేడాది బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరాను. గత ఎనిమిది, తొమ్మిది నెలలుగా బీజేపీ నేతలు నాతో చాలా చర్చలు జరిపారు. యడియూరప్ప, విజయేంద్ర ఆహ్వానం మేరకు మళ్లీ బీజేపీలోకి వచ్చాను’’ అని చెప్పారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘‘అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా బీజేపీ అవమానించిందనే కారణంతో జగదీష్ షెట్టర్ గతేడాది కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అయినా మేం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాం. కాంగ్రెస్‌లో ఆయనకు అన్యాయం జరగలేదు. అగౌరవం ఎదురుకాలేదు’’ అని స్పష్టం చేశారు. కాగా, రాజ్యసభకు నామినేట్ చేస్తామనే హామీ దక్కడం వల్లే జగదీష్ షెట్టర్ మళ్లీ బీజేపీలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.