గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో అరుదైన మైలురాయి చేరుకున్న ఇస్రో
మానవులను అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లే సీఈ20 క్రయోజనిక్ ఇంజన్ చివరి రౌండ్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ పరీక్షలను పూర్తి
దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మానవులను అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లే సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి చివరి రౌండ్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ పరీక్షలను పూర్తి చేసినట్టు ఎక్స్‌లో ట్వీట్ చేసింది. 'ఇస్రోకు చెందిన సీఈ20 క్రయోజనిక్ ఇంజన్ ఇప్పుడు గగన్‌యాన్ మిషన్‌లో మానవుల ప్రయాణానికి అనువైందని ఋజువైంది. ఇది ఎంతో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నదని' ట్వీట్‌లో పేర్కొంది. ఈ నెల 13న నిర్వహించిన ఈ పరీక్షలో లైఫ్ డిమాన్‌స్ట్రేషన్, ఎన్‌డ్యురెన్స్, ఫ్యుయెల్ ట్యాంక్ ప్రెజర్, ఇంజన్ భద్రత లాంటి అంశాలను పరిశీలించారు.
ఈ పరీక్ష మహేంద్రగిరిలోని ఇస్రోలో హై ఆల్టిట్యూట్ పరీక్షా కేంద్రంలో జరిగింది. రాకెట్ ఇంజన్‌లలో హ్యూమన్ రేటింగ్ చాలా కీలకం. హ్యూమన్ రేటింగ్ ప్రమాణాల ప్రకారం, మానవ మిషన్‌లకు ఇంజన్‌ల ప్రమాణాలను నిర్ధారించేందుకు నాలుగు ఇంజన్‌లపై 39 హాట్ ఫైరింగ్ పరీక్షలను నిర్వహించారు. ఇది సుమారు 8,810 సెకన్‌ల వరకు కొనసాగింది. వివిధ పరిస్థితుల్లో ఇంజన్‌లను మండించి, పనితీరును పరిశీలించామని ఇక్రో తెలిపింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరిగే మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన పరీక్షలు పూర్తయ్యాయని ఇస్రో పేర్కొంది. రూ. 9 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోకి మనుషులను పంపించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలు ఈ ఘనతను సాధించాయి. భారత్ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోగమాముల్ని సుమారు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోని ఇస్రో పంపించనుంది. అక్కడి నుంచి వారు తిరిగి భూమిపైకి తిరిగి వస్తారు.