Israeli strikes: పెరుగుతున్న మృతుల సంఖ్య.. గాజాలో నరమేధం సృష్టించిన ఇజ్రాయెల్.. ఎంత మంది చనిపోయారంటే?
Israeli strikes: హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ లో భారీ బాంబు దాడులను తిరిగి ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్ :Israeli strikes: హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ లో భారీ బాంబు దాడులను తిరిగి ప్రారంభించింది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన అనూహ్య దాడుల్లో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 404 మంది మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 562 మంది గాయపడినట్లు తెలిపింది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తరగాజా, గాజా సిటీ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. మరణించినవారిలో అత్యధికంగా చిన్నారులు, మహిళలే ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. తొలుత ఈ మరణాలు గాయపడిన వారి సంఖ్య కొంత ఎక్కువగా చెప్పినప్పటికీ తర్వాత వాటిని సవరించింది.
ఇక గాజా ఆసుపత్రుల్లో భయానక పరిస్థితులు నెలకున్నాయి. పిల్లలు ఐసీయూలు నిండిపోయాయని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది మహిళలు చిన్నారులే ఉన్నట్లు యూరోపియన్ ఆసుపత్రి తెలిపింది. అటుఖాన్ యూసిస్ లోనూ క్షతగాత్రులతో అనేక అంబులెన్సులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా గాజాలో ఇజ్రాయోల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 48వేల మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గతంలో దాదాపు 90శాతం మంది పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇటీవల కాల్పుల విరమణతో అనేక మంది తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు సైన్యం భీకర దాడులు మొదలుపెట్టడంతో వారిలో మళ్లీ భయాందోళనలు నెలకున్నాయి.
అటు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో హమాస్ ప్రభుత్వ అధిపతితో పాటు పలువురు సీనియర్ అధికారులు మరణించారు. ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహజత్ అబు సుల్తాన్ కూడా మరణించారని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దళం విమానాలు వారిపై తీవ్ర దాడి చేసినప్పుడు ఈ నాయకులు వారి కుటుంబాలతో ఉన్నారని హమాస్ ప్రకటనలో పేర్కొన్నట్లు వార్తా సంస్థ AFP నివేదిక తెలిపింది.
గాజాలో హమాస్ ప్రభుత్వం అంతం!
హమాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై సైనిక చర్యను పెంచాలని ఆయన ఆదేశించారు. బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇజ్రాయెల్ ఇప్పుడు సైనిక బలగాలను పెంచడం ద్వారా హమాస్‌పై చర్య తీసుకుంటుంది అని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇటీవలి రోజుల్లో ఇజ్రాయెల్ భారీ బాంబు దాడుల్లో 326 మంది మరణించారని, వారిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారని పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 2023లో వివాదం ప్రారంభమైనప్పటి నుండి ఆసుపత్రులు ఇప్పటికే నిండిపోయాయి. గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఆసుపత్రుల నుండి వస్తున్న చిత్రాలు తెల్లటి ప్లాస్టిక్ షీట్లలో చుట్టిన మృతదేహాలను చూపించాయి.
ఇంతలో, ఇజ్రాయెల్ సైన్యం డజన్ల కొద్దీ హమాస్ లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. దీనితో పాటు, అవసరమైనంత వరకు కఠినమైన సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఈ బెదిరింపు మరోసారి భూపోరాటం తిరిగి ప్రారంభమయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ ఆరోపించింది. దీని కారణంగా హమాస్ అదుపులో ఉన్న 59 మంది బందీలను విడుదల చేయడం మళ్లీ కష్టమైంది.