40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష రంగం
భారత స్పేస్ ఎకానమీ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: భారత స్పేస్ ఎకానమీ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇదే సమయంలో శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణం కూడా ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తొలి రాకెట్‌ను ప్రయోగించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ (ఇండిపెండెంట్ ఛార్జ్) మంత్రి, ఏకేడీ లాంటి విదేశీ ఏజెన్సీలు భారత స్పేస్ ఎకానమీ 100 బిలియన్ డాలర్లకు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే భారత స్పేస్ ఎకానమీ 8 మిలియన్ డాలర్లతో ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో వేగవంతమైన వృద్ధి సాధించనుంది. యూరప్ ఉపగ్రహ ప్రయోగాల నుంచి 230-240 మిలియన్ యూరోలూ, యూఎస్ శాటిలైట్ ప్రయోగాల నుంచి 170-180 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అమెరికా తరహాలో భారత్‌లో ఏర్పాటైన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లాంటి సంస్థల ద్వారా అంతరిక్ష రంగం అభివృద్ధిని చూడగలమని చెప్పారు. దేశీయ అంతరిక్ష రంగంలో వనరుల కొరత ఉన్న సంగతి నిజమేనని, విజ్ఞాన శాస్త్రంలో భారత్‌కు ఉన్న అపారమైన అనుభవంతో దీన్ని అధిగమించగలమని తెలిపారు. ఇక, భారత అంతరిక్ష రంగంలో గగన్‌యాన్ కీలక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. రానున్న రోజుల్లో గగన్‌యాన్ ప్రాజెక్టులో వ్యోమగాములను పంపేందుకు ప్రయోగాత్మక పరీక్షలు జరిగాయని, 2025 నాటికి ఈ ప్రక్రియ మరింత ముందుకు వెళ్తుందని మంత్రి వెల్లడించారు.