భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది- సీఐఐ సదస్సులో మోడీ వ్యాఖ్యలు

భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2024-07-30 10:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని ప్రధాని మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జర్నీ టూ వార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ సదస్సు నిర్వహించారు. భారత పరిశ్రమల సమాఖ్య(CII) నిర్వహించిన ఈ సదస్సులో మోడీ మాట్లాడారు. నూతన ఆవిష్కరణలతో కొత్త ఒరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామన్నారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

‘‘ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. 8 శాతం వృద్ధి రేటుతో భారత్‌ దూసుకెళ్తోంది. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే రోజు త్వరలోనే వస్తుంది. ప్రపంచవృద్ధిలో దేశం వాటా 16 శాతంగా ఉంది. గత పదేళ్లలో మూలధన వ్యయం ఐదింతలు పెరిగి రూ.11.11 లక్షల కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం 1.40 లక్షల స్టార్టప్‌లు ఉండగా.. ముద్రా పథకం కింద రుణాలు తీసుకొని 8 కోట్ల మంది బిజినెస్ ప్రారంభించారు. పదేళ్లలో సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. సులభతర జీవనం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది’’ అని మోడీ అన్నారు.

కరోనాతో పోరాటం తర్వాత..

కరోనా సమయంలో వృద్ధి గురించి కేవలం చర్చలు జరిపేవాళ్లమని మోడీ అన్నారు. త్వరలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు. కరోనాతో పోరాటం తర్వాత కూడా భారత్ ను వృద్ధికి పథంలోకి తీసుకొచ్చామన్నారు. జులై 23న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక లోటు పూడ్చేందుకు ప్రయత్నాలు చేశారని పరిశ్రమ వర్గాల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది.


Similar News