గాజాలో యూఎన్ వాహనంపై దాడి.. భారతీయ సిబ్బంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. సౌత్ గాజా సిటీ రఫాపై దాడి చేయవద్దని అమెరికా సహా పలు దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. సౌత్ గాజా సిటీ రఫాపై దాడి చేయవద్దని అమెరికా సహా పలు దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు. ఈ క్రమంలోనే జరిగిన దాడిలో భారతీయుడు చనిపోయాడు.
ఐక్యరాజ్యసమితి సభ్యులతో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాహనంపై దాడి జరిగింది. రఫాలో జరిగిన ఈ దాడిలో భారతీయుడు చనిపోయాడు.దీంతో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూఎన్ లో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బంది చనిపోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. చనిపోయిన భారతీయుడు ఐక్యరాజ్యసమితిలోని భద్రత, రక్షణ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన గతంలో ఆర్మీలో పనిచేసినట్లు తెలుస్తోంది.
రఫాలోని యురోపియన్ హాస్పిటల్‌కు వెళ్తుండగా.. వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో డీఎస్‌ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. సామాన్యులతో పాటు మానవతా సాయం అందజేస్తున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు.
రఫాలోని పాలస్తీయన్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌క్లేవ్‌లోని 11 సహా పరిసరాలను ఖాళీ చేయాలని సూచించింది. సురక్షిత మైన ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రఫాలో భారీ దాడి జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రకటించిన రెండ్రోజులకే దాడి జరగడం గమనార్హం.