న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియాకు రక్షణ రంగం రూపంలో గొప్ప ప్రోత్సాహమే లభించింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ అప్‌గ్రేడెడ్ వర్షన్‌ను రెండు రెజిమెంట్లకు సప్లై చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌తో ఇండియన్ ఆర్మీ ఒప్పందం చేసుకుంది. మూడు, నాల్గవ రెజిమెంట్ల మిసైల్ సిస్టమ్ కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని విలువ రూ. 6000 కోట్లు. ‘ఇది మిసైల్ సిస్టమ్‌లో అప్‌గ్రేడెడ్ వర్షన్. భారత సరిహద్దులో శత్రు విమానాలు లేదా డ్రోన్‌లు కనిపించినప్పుడు వాటిని ఖచ్చితంగా ఛేదించడంలో ఇది ఉపయోగపడుతుంది’ అని రక్షణ రంగం ఉన్నతాధికారులు చెప్పారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ముందుగా అనుకున్నారు.
కానీ స్వదేశీ ఆయుధ వ్యవస్థను మాత్రమే ప్రవేశ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ రెండు క్షిపణి రెజిమెంట్ల క్లియరెన్స్ మేక్ ఇన్ ఇండియా విజయంగా భావించవచ్చు. ఉత్తరాన చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వంటి ఎత్తైన సరిహద్దుల్లో ప్రభావవంతంగా ఉండేలా ఈ అప్‌గ్రేడ్ చేసిన అకాశ్ క్షిపణి వ్యవస్థలను తయారు చేయనున్నారు. ప్రస్తుతమున్న ఆకాశ్ సిస్టమ్‌తో పోలిస్తే ఈ అప్‌గ్రేడ్ వర్షన్ స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్‌తో తయారై మెరుగైన ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. అధిక ఎత్తులో, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలోనూ విశ్వసనీయ పనితీరును కనబరుస్తుంది. ఈ క్షిపణిని 4,500 మీటర్ల ఎత్తులో మొహరించి 25 నుంచి 30 కిలో మీటర్ల రేంజ్‌లోని లక్ష్యాలను ఛేధించవచ్చు.