వరదలతో ఉత్తర సిక్కిం అతలాకుతలం.. 300 మంది టూరిస్టులను రక్షించిన ఆర్మీ
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిక్కింలో వరదలు పోటెత్తాయి.
మంగాన్ (సిక్కిం) : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిక్కింలో వరదలు పోటెత్తాయి. ఉత్తర సిక్కిం జిల్లాను వరదలు ముంచెత్తడంతో దాదాపు 3,500 మంది పర్యాటకులు వాటిలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారని చెప్పారు. ఉత్తర సిక్కిం జిల్లా కేంద్రం మంగాన్ నుంచి చుంగ్‌థాంగ్ కు వెళ్లే రోడ్డులో పెంగాంగ్ సప్లయ్ ఖోలా ప్రాంతం వద్ద వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురైంది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో లెచెన్, లచుంగ్ ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోనే చిక్కుకుపోయారు.
వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1500 మంది టూరిస్టులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి తరలించారు. ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మరో 300 మంది పర్యాటకులను తాజాగా సోమవారం ఉదయం ఆర్మీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.