దిశ, నేషనల్ బ్యూరో: భారత రక్షణ వ్యవస్థ అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం చేరింది. 250 కి.మీ కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను చేధించగల సామర్థ్యం ఉన్న ఎయిర్-లాంచ్‌డ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను వాయుసేన(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. ‘క్రిస్టల్ మేజ్ 2’ లేదా ‘రాక్స్’(ROCKS) అనే పేరుగల ఈ క్షిపణిని అండమాన్ నికోబర్ దీవులలో గతవారం సుకోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించగా, నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ వర్గాలు మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించాయి. ఇజ్రాయెల్ అందించిన సాంకేతికతతో రూపొందించిన ఈ క్షిపణి.. 250 కి.మీ కంటే ఎక్కువ స్ట్రైక్ రేంజ్‌ను కలిగి ఉంటుందని, శత్రువుల దీర్ఘశ్రేణి రాడార్, వాయు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోగలదని తెలిపాయి. ఈ క్రిస్టల్ మేజ్ 2 మిస్సైల్, వాయుమార్గం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల కొత్త తరం క్షిపణులకు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్లను ఈ క్షిపణి అధిగమించగలదని, జీపీఎస్ పనిచేయని కఠిన వాతావరణంలోనూ అధిక స్థిరమైన స్థావరాలతోపాటు కదులుతూ ఉండే లక్ష్యాలనూ ఛేదించేలా ‘రాక్స్’ను రూపొందించామని వివరించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఈ క్షిపణులను పెద్ద సంఖ్యలో తయారుచేయాలని ఐఏఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.