ప్రపంచంలో అత్యధిక బలవన్మరణాల రేటు భారత్‌లోనే

2022లో దేశవ్యాప్తంగా 1.71 లక్షల మంది బలవన్మరణాలు చేసుకున్నారు.

Update: 2024-07-11 16:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో యువకుల దగ్గరి నుంచి పెద్దల వరకూ అందరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం బలవన్మరణాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక బలవన్మరణాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, 2022లో దేశవ్యాప్తంగా 1.71 లక్షల మంది బలవన్మరణాలు చేసుకున్నారు. బలవన్మరణాల రేటు ప్రతి లక్ష మందికి 12.4కి పెరిగింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక రేటు అని నివేదిక అభిప్రాయపడింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, దేశీయంగా బలవన్మరణాలు చేసుకునేందుకు ప్రధాన కారణం డిప్రెషన్ అని, కొందరిలో జన్యుపరమైన, కొన్ని రకాల ఒత్తిళ్ల కారణంగా వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అండ్ బిహేవియరల్ సైన్స్ వైస్ చైర్‌పర్సన్ రాజీవ్ మెహతా అన్నారు. జీవితంలో ఒత్తిళ్లకు పని, ఆర్థిక వ్యవహారాలు, రిలేషన్ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులని ఆయన తెలిపారు. బలవన్మరణాల ద్వారా మరణించే వ్యక్తుల్లో 50-90 శాతం మంది డిప్రెషన్, యాంగ్జయిటీ, బైపొలార్ డిజార్డర్ లాంటి మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు లేదా డిప్రెషన్, ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగం, ఆర్థిక అస్థిరత, వ్యాపారంలో ఏవైనా కారణాల వల్ల భారీ మొత్తంలో అప్పులు చేయడం, కుటుంబ కలహాలు, వైవాహిక సంబంధాలు నిరాశకు దారితీసే వంటి ఇతర కారణాలు బలవన్మరణాలకు ప్రధానంగా నిలుస్తున్నాయి. దీనికి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన వెల్లడించారు. 


Similar News