Canada: కెనడా తీరుపై భారత విదేశాంగ శాఖ సీరియస్

కెనడాలోని భారత దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇవి పూర్తిగా అసత్యాలని పేర్కొంది.

Update: 2024-10-14 10:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని భారత దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇవి పూర్తిగా అసత్యాలని పేర్కొంది. ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసే ట్రూడో ప్రభుత్వ ఎజెండాకు ఆ ఆరోపణలు అనుకూలంగా ఉన్నాయని ఫైర్ అయ్యింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు రాయబారులను ‘పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’లుగా (అనుమానితులుగా) పేర్కొంటూ కెనడా నుంచి భారత విదేశాంగ శాఖకు సమాచారం అందింది. భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చినట్లైంది. 2023లో కెనడా ప్రధాని ట్రూడో భారత రాయబారులపై ఆరోపణలు చేశారు. అప్పట్నుంచి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను భారత్‌తో పంచుకోలేదని విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటికే, కెనడాకు పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. కానీ, తమ వినతిని పట్టించుకోలేదంది. రాజకీయ లబ్ధికోసమే ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై విమర్శలు చేస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 నుంచే ట్రాడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు ఆధారాలున్నయని ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వారిని మంత్రిమండలిలో చేర్చుకున్నారని గుర్తుచేసింది. అంతేకాకుండా, 2020లో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నించారంది. భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని విదేశాంగశాఖ వెల్లడించింది. కెనడా చేస్తున్న ఆరోపణలను ఖండించింది.

లావోస్ లో మోడీ, ట్రూడో..

ఇకపోతే, ఆసియాన్‌ సమావేశాల సందర్భంగా లావోస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. అయితే, అప్పుడు ఇరువురు నేతల మధ్య ఎలాంటి చర్చలు కూడా జరగలేదని కేంద్రం వెల్లడించింది. అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేవరకు, పరిస్థితి సాధారణస్థితికి చేరుకోవడం కష్టమని అప్పట్లోనే విదేశాంగశాఖ తెలిపింది. ఇప్పుడు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడంతో భారత్- కెనడా మధ్య వివాదం మరింత ముదిరినట్లైంది.


Similar News