లఖ్‌బీర్ సింగ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

Update: 2023-12-30 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాలోని హరికే నివాసి అయిన లాండా ప్రస్తుతం కెనడాలోని అల్బెర్టాలోని ఎడ్మాంటన్‌లో ఉన్నాడు. కాగా “లఖ్‌బీర్ సింగ్ గతంలో పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్ భవనంపై జరిగిన ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించాడు. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసేందుకు.. బయటి దేశాల నుంచి..పేలుడు పరికరాలు, అధునాతన ఆయుధాల సరఫరా లో కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఉగ్రవాద స్థావరాలను పెంచడం, దోపిడీలు, హత్యలు, ఐఈడీలను అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పంజాబ్‌తో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి పలు క్రిమినల్ కేసుల్లో లాండా ప్రమేయం ఉందని హోంశాఖ తెలిపింది. అంతేకాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలు, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కాగా 2021లో లాండా పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది.

Tags:    

Similar News