Mamata : ఖబడ్దార్.. డీవీసీ నుంచి వైదొలుగుతాం.. ప్రధాని మోడీకి మమతా బెనర్జీ లేఖ
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం మరో లేఖ రాశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం మరో లేఖ రాశారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) అకస్మాత్తుగా దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందు వల్లే తమ రాష్ట్రంలో వరదలు సంభవించాయని ఆమె ఆరోపించారు. నిర్లక్ష్యపూరితంగా, ఇష్టారాజ్యంగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా ఈ వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషనే కారణమైందన్నారు. మైథాన్, పంఛాట్ డ్యామ్‌ల నుంచి అకస్మాత్తుగా నీటిని దిగువకు వదలడంతో దక్షిణ బెంగాల్‌లోని చాలా జిల్లాలను వరద ముంచెత్తిందని మమతా బెనర్జీ తెలిపారు. దీనివల్ల ఆయా జిల్లాల ప్రజలు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు.
బెంగాల్‌లోని దామోదర్ నది దిగువ ప్రాంతంలో ఇంతభారీ వరదలు సంభవించడం 2009 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి అని దీదీ పేర్కొన్నారు. ‘‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాధాన్యత మారిపోయింది. గతంలో వరదలను కంట్రోల్ చేయడానికి అది ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిపై మాత్రమే ఫోకస్ పెడుతోంది’’ అని బెంగాల్ సీఎం విమర్శించారు. పనితీరు ఇకనైనా మారకుంటే డీవీసీ నుంచి తమ రాష్ట్రం భాగస్వామ్యాన్ని ఉప సంహరించుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై బెంగాల్ శాసనసభ విపక్షనేత సువేందు అధికారి(బీజేపీ) స్పందిస్తూ.. ‘‘ఒకవేళ డీవీసీ నుంచి బెంగాల్ వైదొలిగితే.. రాష్ట్రంలోని 8 జిల్లాలకు విద్యుత్ సప్లై ఆగిపోతుంది. ఈవిషయాన్ని గుర్తుంచుకునే మమత మాట్లాడుతున్నారా ?’’ అని ప్రశ్నించారు.