రెండు నెలల్లో వడదెబ్బకు 56 మంది మృతి.. 25,000 హీట్ స్ట్రోక్‌ కేసులు

దేశంలో ఈ సమ్మర్ సీజన్‌లో ఎండలు దంచికొట్టాయి. గత రికార్డులను దాటేస్తూ ఈ సారి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.

Update: 2024-06-03 09:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఈ సమ్మర్ సీజన్‌లో ఎండలు దంచికొట్టాయి. గత రికార్డులను దాటేస్తూ ఈ సారి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వడగాలుల తాకిడికి తట్టుకోలేక మార్చి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా దాదాపు 56 మంది చనిపోయారని ప్రభుత్వ డేటా పేర్కొంది. అలాగే 25,000 వరకు హీట్ స్ట్రోక్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగడంతో మే నెలలో ప్రజలు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

శుక్రవారం ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో హీట్ స్ట్రోక్ కారణంగా ఎన్నికల అధికారులతో సహా కనీసం 33 మంది మరణించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నుండి వచ్చిన డేటా ఒక్క మే నెలలోనే వడగాల్పుల ప్రభావానికి 46 మంది చనిపోయారని, దాదాపు 19,189 అనుమానిత హీట్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. ఈ సారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ప్రచారాలకు వెళ్లిన వారు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారు ఎక్కువగా హీట్ స్ట్రోక్‌కు గురయ్యారు.

తీవ్రమైన వేడి గాలుల ప్రభావంతో ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బతో 20 మంది మరణించినట్లు రాష్ట్ర అధికారిక ప్రకటన తెలిపింది. మే నెలలో చాలా మంది చనిపోగా పోస్ట్‌మార్టం పరీక్షల తరువాత వీటిలో 20 వడదెబ్బ మరణాలుగా నిర్ధారించారు. ఇదే సమయంలో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు రెమల్ తుఫానుకు గురయ్యాయి. అస్సాంలో భారీ వర్షాలు దాదాపు 14 మందిని బలిగొన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి రుతుపవనాలు కేరళలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడం ప్రారంభం కాగా తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం లభించింది.


Similar News