ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయకుండా 144 సెక్షన్ విధించడం దారుణం: మెహబూబా ముఫ్తీ

పుల్వామాలో 144 సెక్షన్ అమలు చేసి ప్రజలు ఓటు వేయడానికి బయటకు రాకుండా వారిని వేధించడానికి ప్రయత్నిస్తున్నారని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు

Update: 2024-05-11 09:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పుల్వామాలో 144 సెక్షన్ అమలు చేసి ప్రజలు ఓటు వేయడానికి బయటకు రాకుండా వారిని వేధించడానికి ప్రయత్నిస్తున్నారని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, పుల్వామా జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 144 సెక్షన్ విధించారు. తమ పీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. కార్యకర్తలను సెలెక్టివ్‌గా టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇటీవల ఆజం ఖాన్ అనే 70 ఏళ్ల కార్యకర్తను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకుని అదుపులోకి తీసుకుని రెండు రోజుల తర్వాత అతన్ని విడుదల చేశారని ఆమె చెప్పారు. తమ పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్న క్రియాశీల కార్యకర్తలను పోలింగ్‌కు ముందే అదుపులోకి తీసుకున్నారని ముఫ్తీ ఆరోపించారు.

ఎన్నికల్లో అవకతవకలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, తద్వారా లోక్‌సభ ఎన్నికలను ముందే 'ఫిక్స్' చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, ఎన్నికలు జరిగే చోట ఆంక్షలు విధించడం గతంలో జరగలేదు, అది కూడా ఎన్నికలు ముగిసే వరకు అని ఆమె విమర్శించారు. అలాగే భారత ఎన్నికల సంఘంపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. 1987లో జరిగిన దానినే మళ్లీ మళ్లీ చెప్పాలని భారత ఎన్నికల సంఘం భావిస్తోందని, ఈ ఎన్నికల డ్రామా ఎందుకు సృష్టిస్తోందో నాకు అర్థం కావడం లేదని పీడీపీ అధ్యక్షురాలు ఆరోపించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను 'ఎన్నికల డ్రామా' ఆపాలని ముఫ్తీ కోరారు.


Similar News