IIT Guwahati: సరిహద్దు భద్రత కోసం ఏఐ ఆధారిత రోబోల నిఘా
సరిహద్దుల భద్రత కోసం అసోంలోని గౌహతి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) పరిశోధకులు అడ్వాన్స్ డ్ రోబోలను తయారు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల భద్రత కోసం అసోంలోని గౌహతి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) పరిశోధకులు అడ్వాన్స్ డ్ రోబోలను తయారు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రత నిర్వహించేందుకు ఈ రోబోలు ఉపయోగపడనున్నట్లు అధికారులు తెలిపారు. ఏఐ ఆధారిత నిఘాతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఐఐటీ గౌహతిలోని డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (DSRL) అనే స్టార్టప్ అభివృద్ధి చేసిన ఈ రోబోలు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ నుంచి గుర్తింపు పొందాయి. భారత సైన్యం ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏఐ ఆధారిత నిఘా
గస్తీపై ఆధారపడే భద్రతా చర్యలకు భిన్నంగా రోబోలు స్వయంప్రతిపత్తి వ్యవస్థ కలిగి ఉన్నాయని డీఎస్‌ఆర్‌ఎల్ సీఈఓ (CEO) అర్నబ్ కుమార్ బర్మాన్ తెలిపారు. ‘‘నావిగేషన్, AI-ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, కీలకమైన మౌలిక సదుపాయాల నిఘా, వ్యూహాత్మక రక్షణ విషయాల్లో గేమ్ ఛేంజర్ కానుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. జాతీయ, అంతర్జాతీయ భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి ఏఐ ఆధారిత అత్యాధునిక నిఘా పరికరాలను అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో డ్రోన్లు పంపడం, చొరబాటు యత్నాలు చేస్తే రోబోల సెన్సార్లు వెంటనే గుర్తించి అలెర్ట్ చేస్తాయన్నారు. జాతీయభద్రతను బలోపేతం చేసేలా మరిన్ని ఆవిష్కరణ చేస్తామన్నారు.