సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సొంతపార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గోవా బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలను హెచ్చరించారు.

Update: 2024-07-13 04:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సొంతపార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గోవా బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలను హెచ్చరించారు. “కాంగ్రెస్ చేసిన తప్పులనే మనం చేస్తే.. వారికి మనకు తేడా ఏం ఉంటుంది” అని కార్యకర్తలను ప్రశ్నించారు. బీజేపీ అంటేనే ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ అని అన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు బీజేపీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఎల్‌కె అద్వానీ "బీజేపీ భిన్నమైన పార్టీ" అని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. బీజేపీ భిన్నత్వం ఉన్న పార్టీ అని అద్వానీ చెప్పేవారని అన్నారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో అర్థం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ తప్పిదాల వల్లే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని.. అదే తప్పులు చేయకుండా పార్టీని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తే.. వారు అధికారం కోల్పోవడం, బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.

అవినీతి రహిత భారత్ కు కృషి చేయాలి

అందుకే మనల్ని ప్రజలు పదే పదే నమ్మి అధికారం కట్టబెడుతున్నారని నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాజకీయాలు సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికేనని నేతలు తెలుసుకోవాలని సూచించారు. అవినీతి రహిత భారత్‌ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలని అన్నారు. కుల రాజకీయాలు చేయవద్దని తెలిపారు. కుల రాజకీయాలు చేస్తే ప్రతిచర్య కూడా గట్టిగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.


Similar News