లడఖ్‌లో IAF అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. పైలట్లు సురక్షితం
భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ లడఖ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ లడఖ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ల్యాండింగ్ ప్రక్రియలో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల కారణంగా చాపర్ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసినట్లు IAF అధికారి తెలిపారు. ఈ ఘటన బుధవారం జరిగిందని, విమానంలో ఉన్న పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. లడఖ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)లో ఎత్తైన ప్రదేశాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. పైలట్లను సమీప ఎయిర్‌బేస్‌కు తరలించారు. అత్యవసర ల్యాండింగ్‌కు గల ఖచ్చితమైన కారణాన్ని కనిపెట్టడానికి IAF కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ప్రారంభించింది.
అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అపాచీ అత్యాధునిక పోరాట హెలికాప్టర్లలో ఒకటి. ఇది అమెరికా సైన్యంలో కీలకంగా సేవలు అందిస్తుంది. 2015 సెప్టెంబర్‌లో అమెరికాతో రూ.13,952 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది దీని ప్రకారం, ఈ అధునాతన హెలికాప్టర్‌లలో 22 భారత్‌కు అందించింది. అదనంగా, భారత సైన్యం తన అవసరాల కోసం ఆరు అపాచీ హెలికాప్టర్‌లను కొనుగోలు చేయడానికి ఫిబ్రవరి 2020లో రూ. 5,691 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం భారత్ వాటిని స్వీకరించే పనిలో ఉంది.