Dilip Ghosh: అరిస్తే పీక పిసికేస్తా... బీజేపీ మాజీ ఎంపీవివాదాస్పద వ్యాఖ్యలు

“అలా అరవకండి.. అరిస్తే పీక పిసికేస్తా” అంటూ పశ్చిమబెంగాల్ బీజేపీ నేత, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

Update: 2025-03-22 08:46 GMT
Dilip Ghosh: అరిస్తే పీక పిసికేస్తా... బీజేపీ మాజీ ఎంపీవివాదాస్పద వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: “అలా అరవకండి.. అరిస్తే పీక పిసికేస్తా” అంటూ పశ్చిమబెంగాల్ బీజేపీ నేత, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఖరగ్‌పూర్‌లోని వార్డు నంబర్-6లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రారంభోత్సం సందర్భంగా దిలీప్‌ ఘోష్‌ను అక్కడున్న మహిళలు అడ్డగించారు. “మేం ఇప్పుడు గుర్తొచ్చామా?. మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియాకు ఎందుకు ఒక్కసారి కూడా రాలేదు” అని నిలదీశారు. రోడ్డును కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మిస్తే మీరు వచ్చి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు. మహిళల ప్రశ్నలకు దిలీప్‌ ఘోష్‌ అసహనం వ్యక్తం చేశారు. వారితో వాదిస్తూ..‘ఈ రోడ్డు నిర్మాణానికి నేనే డబ్బులు ఇచ్చాను. మీ బాబు డబ్బులతో రోడ్డు వేయలేదు. కావాలంటే వెళ్లి ప్రదీప్ సర్కార్‌ను అడగండి’ అంటూ మండిపడ్డారు. ఆయన సమాధానానికి మహిళలు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి మహిళలు కల్పించుకుని.. “మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?. ఎంపీ మీరు కదా.. రోడ్డు వేయాల్సింది కూడా మీరే” అని అని నిలదీశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన దిలీప్ ఘోష్ బెదిరింపులకు దిగారు. వెంటనే..‘అలా అరవకండి. అలా అరిస్తే మీ పీక పిసికేస్తా. నేను పార్లమెంటేరియన్‌గా ఉన్నప్పుడు ఎంపీ నిధుల నుండి రోడ్డు నిర్మాణానికి డబ్బు ఇచ్చాను" అని ఆయన నిరసనకారులను బెదిరించారు. అంతేకాకుండా వారిని "తృణమూల్ పార్టీ కుక్కలు" అని పిలిచారు.

మాజీ ఎంపీపై టీఎంసీ ఆగ్రహం

అంతేకకుండా.. మహిళలకు, దిలీప్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు దిలీప్ ఘోష్‌ను వెంటనే కారు ఎక్కించగా.. మహిళలు వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే ఘోష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. తాను పార్లమెంటేరియన్‌‌గా ఉన్న సమయంలోనే ఎంపీ లాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుకు డబ్బు ఇచ్చానని వివరణ ఇచ్చారు. అయితే, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీంఎసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు, ఖరగ్ పూర్ కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్యే ప్రదీప్ సర్కార్ దిలీప్ ఘోష్ చర్యను ఖండించారు. ఆయన వాడిన భాష తప్పని హితవు పలికారు. ప్రస్తుతం ఎంపీ కాకపోయినా రోడ్డు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు. “నేను అక్కడ లేను. కానీ అతను నా తండ్రిని కూడా అవమానించారు. మహిళలను 500 రూపాయల కార్మికులు అని పిలిచాడు. ఘోష్ క్షమాపణ చెప్పాలి. లేకపోతే, ఆయన ఖరగ్‌పూర్‌లో ఎక్కడికి వెళ్లినా నిరసనలు జరుగుతాయి. అలాంటి భాష ఒక మాజీ ఎంపీకి తగనిది" అని కౌన్సిలర్ అన్నారు.

Tags:    

Similar News