సీఎం పదవి వీడాలనుకుంటున్నా.. అది నన్ను వదలనంటోంది : Ashok Gehlot

Update: 2023-08-07 15:18 GMT

జైపూర్: ‘నేను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలనుకుంటున్నాను. కానీ.. ఈ పదవి నన్ను వదిలి పెట్టడం లేదు. ఈ విషయం చెప్పేందుకు ధైర్యం కావాలి’ అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి సీఎం పదవి కోసం మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో గెహ్లాట్ ఘర్షణ పడుతున్నారు. మరికొన్ని నెలల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈసారి కూడా గెహ్లాట్ తనకు తాను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్లు కనబడుతోంది. అదే సందర్భంలో పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అధిష్టానంపై విశ్వాసం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారని, ఇది చిన్న విషయం కాదన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెహ్లాట్, పైలట్‌ల మధ్య పార్టీ అధిష్టానం ఇటీవల సయోధ్య కుదిర్చింది. గత సెప్టెంబర్ నెలలో గెహ్లాట్‌కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసింది. ఆయన స్థానంలో రాజస్థాన్ సీఎంగా పైలట్‌ను నియమించాలని స్కెచ్ వేసింది. దీన్ని ముందే పసిగట్టిన గెహ్లాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి తననే సీఎంగా కొనసాగించాలని వారితో చెప్పించారు. దీంతో రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లు, అవినీతి సమస్యలపై గెహ్లాట్‌కు ఇబ్బంది కలిగించాలని పైలట్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. కానీ.. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చింది.


Similar News