Russia-Ukraine war: ఆఫ్రికా దేశం మాలిలో 50 మంది మాస్కో సైనికుల హత్య
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికాకు విస్తరించింది. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మాస్కో కిరాయి సైన్యానికి ఎదురుదెబ్బ తగిలింది. మాలిలోని తిరుగుబాటుదారులు, రష్యా సైన్యం మధ్య భీకర పోరు జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికాకు విస్తరించింది. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మాస్కో కిరాయి సైన్యానికి ఎదురుదెబ్బ తగిలింది. మాలిలోని తిరుగుబాటుదారులు, రష్యా సైన్యం మధ్య భీకర పోరు జరిగింది. ఇందులో రష్యా వాగ్నర్ గ్రూపునకు చెందిన 50 మందిని రెబల్స్ అతి కిరాతకంగా చంపేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఇచ్చిన సమాచారంతోనే కిరాయి సైన్యంపై తిరుగుబాటుదారులు మెరుపుదాడి చేసినట్లు పేర్కొన్నాయి. మాలి ప్రభుత్వానికి సహకరిస్తున్న రష్యా వాగ్నర్ గ్రూప్ ‘ఆఫ్రికన్ కోర్’పై గతవారం తిరుగుబాటుదారులు, ఇస్లామిక్ మిలిటెంట్లు దాడి చేశారు. వాగ్నర్ సైనికులు వీరికి ధీటుగా బదులిచ్చినా.. కొద్దిసేపటికే ఇసుక తుఫాను వచ్చింది. అదే అదనుగా రెబల్స్ మెరుపు దాడి చేయడంతో.. 50 మంది వాగ్నర్ సభ్యులు చనిపోయినట్లు కథనాలు వచ్చాయి.
ఉక్రెయిన్ సమాచారంతోనే..
దాడిని వాగ్నర్ గ్రూప్ తమ టెలిగ్రామ్ ఛానల్‌లో ధ్రువీకరించింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మృతుల్లో కమాండర్ సెర్గీ షెవ్‌షెంకో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా వాగ్నర్ గ్రూప్ గురించి మాలి తిరుగుబాటుదారులకు ఉక్రెయిన్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత దాదాపు 15 మంది రష్యన్ ఫైటర్లను బంధించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కి వారిని అప్పగించనున్నారట. వాగ్నర్ సభ్యుల దగ్గరున్న యుద్ధ ట్యాంకులు, ట్రక్కులను కూడా తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. మాలిలో గత కొన్నేళ్లుగా మిలిటెంట్లు, రెబల్స్ సమస్యను ఎదుర్కొంటోంది. అక్కడి ప్రభుత్వం రష్యా సాయం అడగ్గా.. 2021 నుంచి వాగ్నర్ గ్రూపు అక్కడ పనిచేస్తుంది.