ఎన్నికల ప్రచారానికి బీజేపీ 'ఏఐ' వ్యూహం
బీజేపీ గత ఎన్నికల్లో పెద్దగా రాణించలేకపోయిన రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయాలతో పాటు ఎన్నికల ప్రచారానికి సైతం టెక్నాలజీని వాడటంలో బీజేపీ ఎప్పుడూ మిగిలిన పార్టీల కంటే ఒకడుగు ముందే ఉంటుంది. గత దశాబ్దంలో ప్రధాని మోడీ అనుసరించిన టెక్ ప్రచారం కారణంగానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ముఖ్యంగా ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకోవడం, వివిధ పథకాలు, ప్రకటనలకు ఇచ్చే ప్రాధాన్యతకు సమానంగా బీజేపీ పార్టీ టెక్నాలజీకి కూడా ఇస్తుంది. ఈ ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం సైతం బీజేపీ కొత్త టెక్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)ని విరివిగా వాడుకోవాలని చూస్తోంది. తద్వారా ఓటర్లకు తక్కువ సమయంలో, భిన్నమైన పద్దతిలో చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో పెద్దగా రాణించలేకపోయిన రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో సీట్ల సంఖ్య పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రసంగం చేసినా, ఇతర రాష్ట్రాల మాతృభాషలోకి ఆయన ప్రసంగం అనువాదం జరిగేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, మరాఠీ భాషల్లోకి బీజేపీ రియల్ టైమ్‌లో మోడీ ప్రసంగాలను అనువదిస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 129 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీ 29 మాత్రమే దక్కించుకోగలిగింది. ఇందులోనూ అత్యధికంగా కర్ణాటక నుంచి లభించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ మధ్యే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రభావం చూపగలిగింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రసంగాలను అనువాదం చేసి మరింత చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.
గత డిసెంబర్‌లో కాశీ తమిళ సంగమం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించేందుకు ఏఐని ఉపయోగించారు. 'ఇది ఒక కొత్త ప్రారంభం. నేను మిమ్మల్ని చేరువ కావడాన్ని ఇంకా సులభతరం చేస్తుంది' అని ఆ సమయంలో ప్రధానమంత్రి చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు మరింత దగ్గర కావడానికి బీజేపీ ఐటీ సెల్ ఎప్పటికప్పుడు ప్రసంగాలను స్థానిక భాషల్లో అనువాదం చేసి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఓటరుకు దగ్గరవుతోంది. దక్షిణాదితో పాటు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశాల్లో మరిన్ని స్థానాలు గెలిచేందుకు ఇదే వ్యూహం అనుసరిస్తోంది.
మరోవైపు పార్టీ డేటాబేస్‌లను రూపొందించేందుకు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకునేందుకు బీజేపీ నమో యాప్‌ని తీసుకొచ్చింది. గ్రౌండ్ స్థాయిలో అభిప్రాయ సేకరణకు కూడా ఇదే యాప్‌ని వినియోగిస్తోంది. 'డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్' క్యాంపెయిన్ కింద పార్టీ విరాళాల కోసం సైతం ఇదే యాప్‌ని వాడుతున్నారు.