హిమాచల్‌లో మొదలైన అసలైన రాజకీయం!
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనాలను నమోదు చేస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనాలను నమోదు చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఫలితాలు హంగ్ దిశగా కొనసాగుతుండటంతో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. అందుకోసం కమలనాధులు ప్లాన్-బీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస సీట్లు 35 స్థానాలు. అయితే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 35 స్థానాల్లో బీజేపీ 30 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా స్వతంత్రులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో ఊదరగొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాల వరకు వచ్చే సరికి తేలిపోయింది.
ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడే అసలైన రాజకీయం మొదలైందనే టాక్ వినిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు వరుసగా రెండు సార్లు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టింది లేదు. దీంతో ఇక్కడ రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా ఈసారి హిస్టరీ క్రియేట్ చేస్తామని బీజేపీ చెబుతుంటే చరిత్రనే రిపీట్ అవుతుందనే నమ్మకం కాంగ్రెస్ లో నెలకొని ఉంది. అయితే వస్తున్న ఫలితాలు మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఏ పార్టీకి లేకపోవడంతో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారుతోంది. ప్రస్తుతం 3-5 స్థానాల్లో స్వతంత్రులు లీడ్ లో కొనసాగుతుండటంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్స్, రెబల్ అభ్యర్థులు కీలకం కాబోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ అప్పుడే ప్లాన్ బీ తో రంగం లోకి దిగింది. స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను ప్రత్యేకంగా హిమాచల్ కు పంపించింది.
దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన ఇప్పటికే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు గత అనుభవాల దృష్ట్యా ఈ సారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. తమ అభ్యర్థులు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతోంది. ఇప్పటికే ఛత్తీస్ గఢ్‌లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హిమాచల్ ప్రదేశ్ అభ్యర్థుల బాధ్యతలు అప్పగించిందనే చర్చ జరుగుతోంది. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను ఛత్తీస్ గఢ్ కు తరలించే ప్లాన్ లో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. దీంతో బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చివరన సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎవరు అనేది ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆ పార్టీకి భారీ ఊరట కానుంది. గుజరాత్ లో ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ నే నమ్ముకుంది. ఇక్కడ గట్టి ప్రయత్నమే చేసింది. ఈ క్రమంలో ఇక్కడ అధికారం చేజిక్కించుకుంటే అది వచ్చే ఏడాది రాబోయే ఛత్తీస్ గఢ్, కర్ణాటక, మహారాష్ట్రా, తెలంగాణలో కొంతలో కొంత ఆ పార్టీకి అనుకూలించే అంశం కానుంది.