Himachal pradesh: మసీదు కూల్చివేయాలని నిరసన.. హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్రిక్తత

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలీ ప్రాంతంలో మసీదు నిర్మాణంపై చెలరేగిన వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది.

Update: 2024-09-05 13:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలీ ప్రాంతంలో మసీదు నిర్మాణంపై చెలరేగిన వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. అయితే గురువారం భారీగా స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మసీదు నాలుగు అంతస్తులు చట్టవిరుద్ధంగా నిర్మించారని పదేళ్లు అవుతున్నా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మసీదును వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సైతం వీరికి మద్దతు తెలిపారు. దీంతో మసీదు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి అనిరుధ్ సింగ్ నిరసన ప్రదేశానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుందని తెలిపారు. ప్రతి చర్య చట్టబద్ధంగా ఉండేలా చూస్తుందని చెప్పారు. ఇది దేవాలయం, మసీదు సమస్య కాదని, అక్రమ నిర్మాణాలకు సంబంధించినదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేదని తెలిపారు. మసీదు ప్రభుత్వ భూమిలో నిర్మించారని, గత 14 ఏళ్లుగా దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. సీఎం సుఖ్వింధర్ సుఖూ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నివాసితులందరికీ సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందన్నారు. 


Similar News