Independence Day: ఢిల్లీలో హై అలెర్ట్

స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ లేదా పంజాబ్ లో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి.

Update: 2024-08-14 05:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ లేదా పంజాబ్ లో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. జమ్ము కేంద్రంగా ఉగ్రకుట్ర జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్ములో యాక్టివ్ గా ఉన్న ఉగ్రసంస్థకు చెందిన ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు రోజే దాడి జరగకపోవచ్చని పేర్కొన్నాయి. కానీ, ఒకరోజు లేదా రెండు రోజుల తర్వాత దాడి జరిగే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. జమ్ముకశ్మీర్ లోని కథువా సరిహద్దులో ఇటీవల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల కదలికలు గుర్తించినట్లు వెల్లడించాయి. ఆయుధాలతో పఠాన్ కోట్ నగరానికి వెళ్లినట్లు గమనించామని పేర్కొన్నాయి. "జూన్ 1న పేలుడు పదార్థాలు, ఐఈడీలు జమ్ము ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ పేలుడు పదార్థాలను రాబోయే రోజుల్లో భద్రతా సంస్థలు, శిబిరాలు, వాహనాలు లేదా ముఖ్యమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చు” అని నిఘా వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టున జరిగే సమావేశాలే లక్ష్యంగా దాడి చేయవచ్చని నివేదికలు హెచ్చరించాయి. ప్రభుత్వ నిర్ణయాలు లేదా చర్యల కారణంగా అసంతృప్తి చెంది ప్రతీకారం తీర్చుకునే ముప్పు ఉందని పేర్కొన్నాయి.

దేశ రాజధానిలో భద్రతా చర్యలు

స్వాతంత్య్ర వేడుకల సన్నాహక కార్యక్రమాలకు కూడా ఢిల్లీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ సహా దేశ రాజధాని అంతటా 3 వేల మంది ట్రాఫిక్ అధికారులు, 10వేల కంటే ఎక్కువ మంది పోలీసు సిబ్బంది, 700 ఏఐ ఆధారిత కెమెరాలోత నిఘా పెంచారు. ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్స్, మాల్స్, మార్కెట్లతో సహా కీలక ప్రదేశాలతో అదనపు పోలీసులు బృందాలు, పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత, రాబోయే ఈవెంట్‌లో స్నిపర్లు కీలక పాత్ర పోషించవచ్చని నొక్కిచెప్పారు. ఎర్రకోట వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా పేర్కొన్నారు. ట్రంప్ పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ పటిష్ట భద్రతా చర్యల అవసరాన్నిగుర్తుచేశారు. ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాన్ని ఈవెంట్ ముగిసే వరకు "నో కైట్ ఫ్లయింగ్ జోన్"గా ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్టు 2-16 వరకు పారాగ్లైడర్‌లు, హ్యాంగ్-గ్లైడర్‌లు, హాట్ ఎయిర్ బెలూన్‌లపైనా నిషేధం విధించారు.


Similar News