Hemanth soren: జైలులో పెట్టి విలువైన టైం వృధా చేశారు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
భూ కుంభకోణం కేసులో తనను జైలుకు పంపి తన విలువైన సమయాన్ని వృధా చేయకుంటే..జార్ఖండ్ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించి ఉండేవాడినని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భూ కుంభకోణం కేసులో తనను జైలుకు పంపి తన విలువైన సమయాన్ని వృధా చేయకుంటే..జార్ఖండ్ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించి ఉండేవాడినని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. జార్ఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై సోరెన్ తాజాగా స్పందించారు. ‘నేను రాష్ట్ర ఆస్తులతో పరారీలో ఉన్నానంటూ నాపై, నా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసి జైలులో పెట్టారు. దీని కారణంగా విలువైన సమయం చాలా వృధా అయింది. అనేక మంది ప్రజలు సమస్యలతో నన్ను కలవడానికి వేచి ఉంటున్నారు. విలువైన టైం కోల్పోకుంటే సగానికి పైగా సమస్యలు ఇప్పటికే పరిష్కారమయ్యేవి’ అని తెలిపారు. న్యాయవ్యవస్థ అత్యున్నతమైందని రాజ్యాంగానికి ఒక మూలస్థంభం లాంటిదని చెప్పారు. అయితే పేదలు, దళితులు మరియు గిరిజనుల గొంతుకగా మారడానికి ప్రయత్నిస్తున్న వారి గొంతులను నిశ్శబ్దం చేయడానికి న్యాయవ్యవస్థ అధికారాలను దుర్వినియోగం చేయడానికి కొన్ని శక్తులు అదే విధంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.