కేజ్రీవాల్ పిటిషన్‌పై సెప్టెంబర్ 9న విచారణ..ఢిల్లీ హైకోర్టు వెల్లడి

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది.

Update: 2024-07-11 12:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది. జస్టిస్ ప్రతిభా సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కేజ్రీవాల్‌కు 4 వారాల సమయం ఇచ్చింది. కేజ్రీవాల్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది.. పరిస్థితుల్లో కొన్ని మార్పులు ఉన్నాయని, తమకు సరైన లీగల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, దీనిపై హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున రీజాయిండర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరారు. దీంతో కేజ్రీవాల్‌ సమాధానాన్ని నాలుగు వారాల్లోగా తెలియ జేయాలని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు కూడా కేజ్రీవాల్ తన సమాధానం దాఖలు చేయడానికి కోర్టు చాలాసార్లు సమయాన్ని పొడిగించింది. కాగా, మద్యం పాలసీ కేసులో ఈడీ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఏడో అనుబంధ చార్జిషీట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే.

సిసోడియాకు షాక్: విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో తన బెయిల్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కరోల్, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారీ షాక్ తగిలింది. విచారణకు ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కుమార్ కేసు నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ధర్మాసనం నుంచి వైదొలగుతున్నట్టు తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. వచ్చే వారం కొత్త బెంచ్ ముందు కేసు లిస్టింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇది జూలై 15న కొత్త బెంచ్ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.


Similar News